జిల్లా జైలును సందర్శించిన డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సోమవారం ఏలూరులోని జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహాయం చేస్తుందని తెలిపారు. ఖైదీలతో మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖైదీలకు ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేసి కేసులు వాదిస్తుందని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పథకాలు పొందడంలో అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని రాజీయోగ్యమైన కేసులలోని ముద్దాయిలు సమస్యను పరిష్కరించుకొని కేసు నుంచి విముక్తి పొందాలని సూచించారు.
ఎకై ్సజ్ తనిఖీల్లో వ్యక్తి అరెస్టు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని వెంకట్రామన్నగూడెం గ్రామంలో సోమవారం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని నుంచి ఆరు డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎకై ్సజ్ సీఐ కేఎస్‌వీ.కళ్యాణ్ చక్రవర్తి వివరించారు. తనిఖీల్లో ఎస్సైలు మురళీమోహన్, దొరబాబు, ఈఎస్‌టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఏలూరు రూరల్‌ః ఏలూరుకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులు ఎస్‌జీఎఫ్ జాతీయయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటున్నారని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు, కోశాధికారి కె.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో పి.జయశ్రీ,, డి.సాయిభవాని, దేవిశ్రీ, ఏ.రుత్విక, జి.పూజిత ఉన్నారని వివరించారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో ప్రతిభ చాటారని గుర్తు చేశారు. దీంతో వీరు ఈ నెల 20 నుంచి 26 వరకూ పాటియాలలో జరిగే 68 వ జాతీయ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.సాంబశివరావు అభినందించారు.
పంట ధ్వంసంపై కేసు నమోదు
టి.నరసాపురం: పొలంలోకి అక్రమంగా ప్రవేశించి, పంటను ధ్వంసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వి.జయకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బంధంచర్ల గ్రామానికి చెందిన బేతి సరోజినికి గ్రామంలో 5.08 ఎకరాల మెరక భూమి ఉంది. ఈ భూమిలో కుటుంబసభ్యులతో కలిసి పొగాకు పంట సాగు చేసుకుంటోంది. ఈ నెల 16న పాత గొడవల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బేతి శేషయ్య, సిరింగుల సునీల్, బేతి సత్యనారాయణ, కాంతారావు, బేతి పెద్దపుల్లయ్య, బేతి జాన్, బేతి రాజులతో కలిసి సరోజిని పొలంలో ప్రవేశించి పొలంలో ఉన్న షెడ్డును ధ్వంసం చేసి, ట్రాక్టర్‌తో పంటను దున్నివేశారన్నారు. వ్యవసాయ పనిముట్లు ధ్వంసం చేయడంతో పాటు భయభ్రాంతులకు గురిచేశారన్నారు. చంపుతానని బెదరించినట్లు సరోజిని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
ఆయుధ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలి
ఏలూరు (టూటౌన్): జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో 1500 ఎకరాల విస్తీర్ణంలో నావిక విభాగానికి అవసరమైన ఆయుధాల పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాలని చూస్తున్నాయని దీన్ని తక్షణం నిలుపుదల చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ సోమవారం బహిరంగ లేఖ రాసింది. వివరాలను సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి పత్రికలకు విడుదల చేశారు. ప్రజలు వద్దన్నా పరిశ్రమ పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను అంతా వ్యతిరేకిస్తున్నారని, ఈ పరిశ్రమను స్థాపిస్తే వంకావారిగూడెం పంచాయతీలోని 6 గ్రామాలకు చెందిన 3 వేల మంది నిరాశ్రయులవుతారని చెప్పారు. పరిశ్రమ స్థాపిస్తే పరిసర గ్రామాల ప్రజలపై నిఘా ఏర్పడుతుందని, వారు స్వేచ్ఛను కోల్పోవడంతో పాటు గాలి, నీరు, వాయువు కాలుష్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ స్థాపిస్తే ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు దక్కుతాయని ప్రభుత్వాలు చెబుతున్నా వాస్తవానికి స్వీపర్, గేట్ కీపర్ లాంటి కొద్దిపాటి ఉద్యోగాలు తప్ప ఇంకేమీ రావన్నారు. ప్రైవేటు పరిశ్రమ కాబట్టి ఎలాంటి రిజర్వేషన్లు పాటించరన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో నిర్వాసితులైన లక్ష కుటుంబాల్లో కేవలం 10 వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు, జల్లేరు రిజర్వాయర్, అభయారణ్యం బొగ్గుగనుల పేరుతో అడవి బిడ్డలను ఆ ప్రాంతం నుంచి దూరం చేస్తున్నారన్నారు. ఆయుధ పరిశ్రమ పెట్టవద్దని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించారని, గ్రామ సభల తీర్మానం అంటే అది సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment