సైబర్ నేరాలపై అప్రమత్తం
ఏలూరు టౌన్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలను అరికట్టేందుకు బ్యాంకర్లు అవగాహనతో పోలీసులకు సహకారం అందించాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం బ్యాంకు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. బ్యాంకుల వద్ద భద్రతా చర్యలు, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లకు కొన్ని బ్యాంకులు పూర్తిగా సహాయ, సహకారాలు అందిస్తున్నట్టు పోలీస్ దర్యాప్తులో స్పష్టమైందన్నారు. బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అందించే వారి ఖాతాలపై నిఘా ఉంచాలన్నారు. ఖాతాదారుల లావాదేవీలపైనా పర్యవేక్షణ ఉండాలన్నారు. వృద్ధులు, నిర్లక్ష్యరాస్యులకు బ్యాంకుల వద్ద లావాదేవీల సమయంలో బ్యాంకు సిబ్బంది సహకారం అందించాలని కోరారు. ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతా చర్యలు, సీసీ కెమెరాలను నిత్యం పరిశీలించాలన్నారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీలు డి.శ్రావణ్‌కుమార్, ఎం.వెంకటేశ్వరరావు, ప్రసాద్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరరావు, సీఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment