ప్రజావాణిని గట్టిగా వినిపించాం
ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్
తణుకు అర్బన్: రాష్ట్ర శాసనమండలి సమావేశాల్లో ప్రజల వాణిని ప్రస్తావించడంలో సఫలీకృతమయ్యామని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలో ప్రతి అంశంపైనా ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి పట్టుబట్టామన్నారు. కూటమి మంత్రులు 80 శాతం సమయాన్ని గత ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే వినియోగించడం శోచనీయమన్నారు. ముఖ్యంగా పంటల బీమా మొత్తాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం చెల్లించేదని.. అయితే కూటమి ప్రభుత్వం రైతులనే కట్టుకోవాలని చెబుతుండటంపై, కరెంటు చార్జీల సర్దుబాటులో భాగంగా వినియోగదారులపై ట్రూఅప్ పేరుతో భారాన్ని మోపే కార్యాచరణపై, సోషల్ మీడియా వేధింపుల పేరుతో అమాయకులపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సభ నుంచి వా కౌట్ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు గ్రామాలకో డంపింగ్ యార్డు ఏర్పాటుచేయాలని, వసతి గృహాల్లో మెస్ చార్జీలను పెంచాలని, బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాల్లో ఉన్న భవనాల పనులను ఇప్పుడు నిలుపుదల చేశారని, వాటిని కూడా కొనసాగించాలని, సంచార జాతులకు ఆధా ర్ కార్డులు కేటాయించి వారికి ప్రభుత్వ సంక్షేమం అందేలా చూడాలని కోరామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపు సామాజికవర్గానికి రూ.10 వేల కోట్లపైగా లబ్ధి చేకూరిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్స్ పాటిస్తూ 15 నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యాచరణ చేయాలని సూచించామన్నారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదనే విషయాన్ని సభ దృష్టికి తీసుకువెళ్లామని ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ తెలిపారు. ఎంపీపీ రుద్రా ధనరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, నాయకులు వి.సీతారాం, ముళ్లపూడి బాబూరావు, జల్లూరి జగదీష్, షేక్ జిలాని, వై.రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment