మృతదేహాల మాయంపై నేడు జీజీహెచ్‌లో విచారణ
ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ బోధనాస్పత్రిలోని మార్చురీలో అనాథ శవాల మాయం సంచలనంగా మారింది. ఏలూరు జీజీహెచ్‌లోని అధికారులు, మార్చురీలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శవాలను భారీ రేటుకు విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏలూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో కమిటీ ప్రాథమిక విచారణ చేపట్టగా అవినీతి, అనాథ శవాల విక్రయాలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డీఎంఈ ఆధ్వర్యంలో ఇద్దరు వైద్యాధికారులతో కూడిన కమిటీని విచారణకు నియమించినట్టు సమాచారం. ఈ అధికారుల బృందం మంగళవారం ఏలూరు జీజీహెచ్‌లో విచారణ చేపట్టనున్నారని తెలిసింది. అలాగే జీజీహెచ్‌లో వైద్య పరికరాల కొనుగోళ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో పూర్వ జీజీహెచ్ సూపరింటెండెంట్, మరో వైద్యాధికారి కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది. ఈ అవినీతి బాగోతంపై ముగ్గురు అధికారులతో కూడిన విచారణ కమిటీని నియమించినట్టు చెబుతున్నారు. ఆయా కుంభకోణాలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సైతం జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment