సమ్మెలోకి కుయ్.. కుయ్..
● నిలిచిన 108 సేవలు
● ఉమ్మడి జిల్లాలో 51 వాహనాలు.. 250 మంది సిబ్బంది
ఏలూరు(టూటౌన్): చర్చలు విఫలం కావడం, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. దీంతో ఏలూరు జిల్లాలోని 28 వాహనాల పరిధిలో 140 మంది పైలెట్లు, ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్)లు, పశ్చిమగోదావరి జిల్లా పరిఽధిలో 23 వాహనాలు, 110 మంది పైలెట్లు, ఈఎంటీలు మొత్తంగా 51 వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న 250 మంది సిబ్బంది సమ్మెలో ఉన్నారు. కొంతకాలంగా 108 సర్వీసులను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని, పాడైన వాహనాలకు బాగు చేయించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని షిఫ్టు విధానాన్ని అమలుచేయాలని 108 సిబ్బంది కోరుతున్నారు. ఈ క్రమంలో వారం క్రితం రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద 108 సిబ్బంది ధర్నాలు నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈనెల 25లోపు తమ సమస్యలను పరిష్కరించకుంటే 25న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ముందుగానే హెచ్చరించినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము సమ్మెబాట పట్టినట్లు 108 ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు.
ప్రభుత్వం స్పందించలేదు
ముందస్తుగానే 108 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా కనీ సం పట్టించుకోలేదు. కలెక్టరేట్ల ముందు చేసిన ధర్నా సందర్భంగా కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంతో సైతం ఈనెల 25లోపు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేస్తామని తెలియజేశాం. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గత్యంతరం లేక సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.
– ఇబ్బా ప్రసాద్, 108, ఉద్యోగుల సంఘం, జిల్లా అధ్యక్షుడు, ఏలూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment