తిరుపతి–చైన్నె బస్సు సర్వీసు ప్రారంభం
జమ్మలమడుగు: జమ్మలమడుగు ఆర్టీసీ డిపో నుంచి తిరుపతి మీదుగా చైన్నెకు నూతన బస్సు సర్వీసు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం డిపో మేనేజర్ ప్రవీన్ ఆధ్వర్యంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రవీన్ మాట్లాడుతూ ప్రస్తు తం చైన్నెకు నెల్లూరు–సూళ్లురుపేట మీదుగా బస్సు సర్వీసు నడుస్తోందన్నారు. అదనంగా తిరుపతి మీదుగా చైన్నెకు ప్రతిరోజు బస్సు సర్వీసు ఉంటుందన్నారు. ఈ సర్వీసులు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శబరిమలకు మరో ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం కడప మీదుగా మరో ప్రత్యేక రైలును నడపుతున్నట్లు కడప రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07147/48 నెంబరుగల రైలు మచిలీపట్నంలో మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుతుందన్నారు. ఈ రైలు గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురంరోడ్డు, కంభం, గిద్దలూరు,నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట మీదు గా కొల్లాం వెళుతుందన్నారు. ఈ రైలు డిసెంబరు 23, 30 తేదీలలో మచిలీపట్నం నుంచి, డిసెంబరు 25, జనవరి 1 తేదీలలో కొల్లం నుంచి బయలుదేరుతుందని వివరించారు.
సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు అర్హతగల వైఎస్సార్ జిల్లా వాసులకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కడప బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు కృష్ణయ్య తెలిపారు. అర్హతగలవారు ఈనెల 24వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ వైఎస్సార్ కడప కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. అలాగే ఈనెల 27వ తేదిన స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారని, అందులో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ఆధారంగా విజయవాడలో శిక్షణ ఇస్తారన్నారు. దరఖాస్తుచేసే అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు విద్యా, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, బ్యాంకు పాస్‌పుస్తకం, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు జతచేసి ఏపీ బీసీ స్టడీ సర్కిల్, పాత రిమ్స్, కడప అనే చిరునామాకు దరఖాస్తులు పంపాలన్నారు. ఇతర వివరాలకు నేరుగా కార్యాలయంలో లేదా 98499 19221,99664 18572 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ..
కడప ఎడ్యుకేషన్: సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌ఏక్యూ టెక్నాలజీస్ నిర్వాహకులు అమీర్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అజూర్, సోల్స్‌ఫోర్స్, పుల్ ట్రాక్, ఎస్‌ఏపీ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మొన్నటి వరకు ఇలాంటి కోర్సుల కోసం హైదరాబాదు, బెంగుళూరు తదితర సిటీలకు వెళ్లేవారని.. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే కడపలోనే తొలి ప్రయత్నంగా ప్రొఫెషనల్స్ చేత కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఈనెల 25 నుంచి కొత్త బ్యాచ్‌లు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7093081073,9110388060 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment