ఇరువర్గాల మధ్య ఘర్షణ
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని కొంగలవీడు పంచాయతీ ఉప్పత్తివారిపల్లె ఎస్సీ కాలనీలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో వర్గానికి చెందిన ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉప్పత్తివారిపల్లె ఎస్సీ కాలనీలో సుమారు పదేళ్లుగా గతంలో జరిగిన ఓ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చిని మూతవేశారు. అప్పటి నుంచి ఎవరి ఇళ్ళల్లో వారే క్రిస్మస్ పండుగను జరుపుకునేవారు. అయితే సుమారు సంవత్సరం నుంచి జయచంద్ర అనే ఉపదేశికుడు ప్రతి ఆదివారం చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుండేవారు. ఇదే సమయంలో త్వరలో జరగనున్న క్రిస్మస్ పండుగను చర్చి ఆవరణలో నిర్వహించాలని ఓ వర్గానికి చెందిన వారు ఏర్పాట్లు చేసుకుంటుండగా మరో వర్గానికి చెందిన గోపయ్య వాగ్వాదానికి దిగి చర్చికి తాళం వేశారు. దీంతో మరో వర్గానికి చెందిన వారు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించగా గోపయ్య, ఆయన అనుచరులు మరో వర్గానికి చెందిన బాబుజగన్నాథరావు, మరియన్న, బాబులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బాబుజగన్నాధరావుకు ఎడమచేయి విరిగింది. వెంటనే స్థానికులు గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జగన్నాధరావును కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయంపై రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను అడుగగా చర్చి విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనని, ఇరువురు పోలీసు స్టేషన్‌లో ఇంకా ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment