బిందు, తుంపర సేద్య లక్ష్యం చేరుకోవాలి
కడప అగ్రికల్చర్ : గ్రామీణ ప్రాంత రైతుల పంట పొలాలకు ఏర్పాటు చేసే బిందు, తుంపర సేద్య లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూక్ష్మనీటి సాగు పథక జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ) వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్‌లోని ఏపీ ఎంఐపీ కార్యాలయంలో బిందు, తుంపర సేద్య లక్ష్యంపై కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 29,300 హెక్టార్లు బిందు, తుంపర సేద్య అమలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే 21,746 మంది రైతులు 27,768 హెక్టార్లకు బిందు, తుంపర సేద్య పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 4072 మంది రైతుల 4780 హెక్టార్లకు పరికరాల మంజూరుకు కలెక్టర్ నుంచి పరిపాలనా అనుమతులను పొందామని తెలిపారు. గ్రామాల్లో బిందు, తుంపర సేద్య పరికరాలు అవసరమున్న రైతులను గుర్తించి వీఏఏఎస్, వీహెచ్‌ఏఎస్, వీఎస్‌ఏఎస్‌లతోపాటు ఎంఐఏడీల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేలా డీలర్లు అవగాహన కల్పించాలన్నారు. కంపెనీ ప్రతినిధులు త్వరగా ప్రాథమిక సర్వే పూర్తి చేసి రైతు వాటాను రైతులు నేరుగా పీడీ అకౌంట్‌కు జమ చేయాలన్నారు. కంపెనీ ప్రతినిధులకు గానీ, డీలర్లకు గానీ ఎవ్వరికీ నగదు రూపంలో ఇవ్వరాదని సూచించారు. రైతు వాటా అందిన వెంటనే పరికరాలను అందించాలన్నారు. పరికరాలు అందించే సమయంలో దరఖాస్తు చేసుకున్న రైతులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మురళీమోహన్‌రెడ్డి, ఎంఐ ఇంజినీర్లు, ఎంఐడీసీలు, జిల్లా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment