అక్రమ పద్ధతుల్లో విదేశాలకు పంపడం నేరం
కడప అర్బన్ : ఉపాధి కోసం గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఇన్‌చార్జి ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సూచించారు. శుక్రవారం స్థానిక ‘పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్’ హాల్‌లో విదేశీ వ్యవహారాల శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రంట్స్, హైదరాబాద్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రిజిస్టర్ ట్రావెల్ ఏజెంట్లు, అన్ రిజిస్టర్ ట్రావెల్ ఏజెంట్లతో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పేరిట పలువురిని అక్రమ పద్ధతుల్లో విదేశాలకు పంపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. సరైన వీసా, ఇతర డాక్యుమెంట్లతో వెళ్లాలని, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెంట్లను మాత్రమే సంప్రదించాలని పేర్కొన్నారు. అలాంటప్పుడే పని చేసే దేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా త్వరితగతిన పరిష్కరించేందుకు సకాలంలో జీతభత్యాలు, మెడికల్ ఇన్సూరెన్స్, మెటర్నిటీ, కుటుంబ వైద్య సౌకర్యం, ప్రమాద బీమా లాంటివి అందుబాటులో వుంటాయన్నారు. ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పి.ఓ.ఈ) అధికారి అంగర రవికుమార్ మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సురక్షిత, సక్రమ వలసలను ప్రజలకు చేరువ చేసేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏవైనా సమాచారాన్ని ఇబ్బందులు ఎదురైనా, అత్యవసరమైన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 1800113090 లేదా 011–26885021కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు, ఎస్‌బీ సీఐ టి.రెడ్డెప్ప, జిల్లాలోని రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ ఏజెంట్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment