విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలి
పులివెందుల రూరల్/టౌన్ : పెంచిన విద్యుత్ చార్జీలను సత్వరమే తగ్గించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పులివెందులలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పి 7 నెలల్లో ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారన్నారు. విద్యుత్ డిస్కంలకు రాయితీలు ఇస్తే కరెంటు చార్జీలు తగ్గించవచ్చునని, గత చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 వరకు రూ.13 వేల కోట్లు మాత్రమే రాయితీలు ఇచ్చారని, వైఎస్ జగన్ పాలనలో రూ.48 వేల కోట్ల డిస్కంలకు రాయితీ ఇచ్చినట్లు చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఇవ్వక విద్యార్థులు కష్టాలు పడుతున్నారని, వీటిపై జనవరి 3వ తేదీన నిరసనలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ, రైతు భరో సా, మహిళలకు రూ.18 వేలు రాలేదన్నారు. ఏడు మాసాల్లో లక్ష కోట్లు అప్పు తెచ్చినా హామీలు నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఇంత తక్కువ కాలంలోనే అసమ్మతి వచ్చిన ప్రభుత్వం చరిత్రలో లేదన్నారు. రైతుల పొలాలకు మీటర్లు బిగిస్తే నిరసనలు చేసి, ఇప్పుడు మీటర్లు బిగిస్తున్నారని పేర్కొన్నారు. పంట బీమాకు ఇ–క్రాప్ అవసరం లేదన్నారు. ఇప్పుడు ఇ– క్రాప్ చేస్తేనే బీమా ఇస్తామంటున్నారన్నారు. రైతుల కు వ్యవసాయ కనెక్షన్ల విషయంలో డబ్బులు చెల్లించినా ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడం లేదన్నారు. రైతుల విషయమే కాక ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇవ్వడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి విద్యుత్‌చార్జీలను పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారన్నారు. ఇష్టం వచ్చిన విధంగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం మీకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. దోమలను చంపినా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారేమోనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జగనన్న పాలనలో
రూ.48 వేల కోట్ల డిస్కంలకు రాయితీ
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment