బద్వేలు అర్బన్ : అధికార బలంతో వైఎస్సార్‌సీపీ నాయకులను, సానుభూతిపరులను వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాఽథ్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ రమాదేవి మామ, వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జి శీలిచెన్నయ్యకు జీవనాధారంగా ఉన్న బంకును తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధలతో కలిసి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాఽథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాలుగా చెన్నయ్య చెన్నంపల్లె సమీపంలోని రోడ్డుకు ఓ వైపున దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడని, కేవలం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నాడన్న అక్కసుతో అధికార పార్టీ నేతలు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి దుకాణాన్ని తొలగించాలని నోటీసు ఇప్పించడం దారుణమన్నారు. బద్వేలు పట్టణంలో వందల కొద్ది అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, అలాగే చెన్నయ్యకు సంబంధించిన దుకాణానికి పది మీటర్ల దూరంలోనే పర్మినెంట్ అక్రమ నిర్మాణం ఉందని, వాటిని పట్టించుకోకుండా చెన్నయ్య దుకాణాన్ని మాత్రమే తొలగించాలని పట్టుబట్టడం సరికాదన్నారు. అధికారం ఎప్పటికీ ఒకరికే పరిమితం కాదని, అధికారులు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. పట్టణంలో ఉన్న అక్రమ నిర్మాణాలను ముందుగా తొలగిస్తే చెన్నయ్య దుకాణాన్ని తామే దగ్గరుండి తొలగిస్తామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే పార్టీ లీగల్ సెల్‌కు సంబంధించిన న్యాయవాది నాగిరెడ్డికి కూడా ఫోన్‌లో విషయం తెలిపి న్యాయపరమైన సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, మాజీ కుడా చైర్మన్ గురుమోహన్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరెడ్డి, పుత్తాశ్రీరాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయిక్రిష్ణ, ఏరియా కన్వీనర్ చెన్నకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు శీలిరమాదేవి, రామ్మోహన్, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment