No Headline
కడప అగ్రికల్చర్/వేముల: జిల్లాలో ఈ ఏడాది చామంతి పంట రైతులకు నష్టాలను మిగిల్చింది. దిగుబడులు బాగా ఉన్నప్పటికీ ధర లేక ఈ పరిస్థితి తలెత్తింది. సాగులో పెట్టుబడులు అధికమైనప్పటికీ ధరలు ఉంటాయనే ఆశతో సాగు చేశారు. దసరా సమయంలో ధరలు ఉన్నప్పటికీ చాలా చోట్ల దిగుబడులు రాలేదు. ఆ తరువాత కార్తీకమాసం, సంక్రాంతి సీజన్‌లో కూడా ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పలువురు రైతులు తెలిపారు.
జిల్లాలో 200 ఎకరాల్లో..
జిల్లాలోని వేముల, వేంపల్లి, పెండ్లిమర్రి, నందిమండలం, ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు మండలాలతోపాటు ఇంకొన్ని మండలాల్లో ఈ ఏడాది రబీలో 200 ఎకరాల్లో చామంతి సాగు చేశారు. ఇందులో వేముల, పెండ్లిమర్రి, వేంపల్లి, ఖాజీపేట మండలాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఎక్కువగా మంది రైతులు చాందిని, పేపరు ఎల్లో, పేపరు వైట్, బుల్టెట్, సెంటెల్లా వంటి రకాలు వేశారు. చామంతి సాగు చేసిన మూడు నెలలకు దిగుబడి చేతికి వస్తుంది. తోటలలో దిగుబడులు ప్రారంభమైనప్పటి నుంచి ధరలు బాగా ఉంటే రైతులు ఆశించిన మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పండుగల సీజన్‌లో మాత్రమే ధరలు ఉండటం, తరువాత పడిపోవడంతో చామంతి రైతులకు నష్టాలు, కష్టాలే మిగులుతున్నాయి.
ధరలు తగ్గుముఖం
సంక్రాంతి పోగానే చామంతి ధరలు మార్కెట్‌లో పడిపోయాయి. సంక్రాంతి వరకు కిలో రూ.130 వరకు పలికింది. తరువాత ధరలు తగ్గుముఖం పట్టాయి. జూన్, జూలైలలో సాగు చేసిన తోటల్లో ముందుగానే పూలు కోతకు వచ్చాయి. అప్పట్లో మార్కెట్‌లో ధరలు ఒక రకంగా ఉండటంతో కొంత మంది రైతులకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు రూ.30 ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు ఇలాగే ఉంటే పెట్టుబడులు కూడా రావని వారు వాపోతున్నారు.
కొనుగోళ్లకు మొగ్గు చూపని వ్యాపారులు
చామంతికి మార్కెట్‌లో ధరలు తగ్గడంతో వ్యాపారులు కూడా కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ధరలు ఉన్నప్పుడు వ్యాపారులు తోటల వద్దకు వచ్చి పూలు కొనుగోలు చేసి వాహనాలలో తరలించేవారు. ప్రస్తుతం ధరలు తగ్గడంతో వ్యాపారులు రాకపోవడంతో రైతులే బయటి ప్రాంతాల మార్కెట్‌కు తరలించుకుంటున్నారు. ప్రస్తుతం తోటలలో కోత కోసిన పూలను చైన్నె, బెంగళూరు మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ ధర ఒక రకంగా ఉంటే అంతో ఇంతే వస్తుందని, రేటు తగ్గితే మాత్రం ఖర్చులు కూడా రావని రైతులు పేర్కొంటున్నారు.
పూలు కోత కోయని రైతులు
ధరలు లేకపోవడంతో చాలా మంది రైతులు తోటల్లో పూలను కోసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. పూలు కోసేందుకు కూలి, రవాణా ఖర్చులు కూడా రావనే ఉద్దేశంతో కోత కోయడం లేదని పలువురు రైతులు అంటున్నారు. సాగు కోసం వేలకు వేలు పెట్టుబడులు పెట్టి దిగుబడులు వచ్చే సమయంలో ధరలు తగ్గడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కష్టమంతా నేలపాలు అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment