ఆగి ఉన్న లారీని ఢీకొన్న బొలెరో
బి.కొత్తకోట : ఒకరు కూలీ పనులు చేసుకొంటూ.. మరొకరు డ్రైవర్‌గా, చికెన్ సెంటర్ నడుపుతూ జీవించే వారు. ఇద్దరూ కలిసి కోళ్ల కోసం వచ్చి తీసుకుని వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ఈ సంఘటన శనివారం రాత్రి బి.కొత్తకోట మండలం కోటిరెడ్డిగారిపల్లి వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటికి చెందిన ఎస్.ఫయాజ్ (30) స్థానికంగా చికెన్ సెంటర్ నడుపుతుండే వారు. డ్రైవర్‌గా కూడా పని చేస్తుంటారు. ఆయనకు భార్య షేక్ అమీనా, ఏడాదిన్నర వయసు కలిగిన కుమార్తె అర్ఫా ఉన్నారు. రాయచోటి సమీపంలోని శిబ్బాలకు చెందిన డి.మహేంద్ర (25) అవివాహితుడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రి సహదేవ అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తల్లి వెంకటలక్ష్మమ్మ గృహిణి. వారిద్దరూ శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత పెద్దతిప్పసముద్రం మండలం రంగసముద్రం వద్ద ఉన్న కోళ్లఫారంలో కోళ్లు కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు బొలెరో వాహనంలో రాయచోటి నుంచి బయలుదేరారు. రంగసముద్రంలో కోళ్లను తీసుకుని రాత్రి రాయచోటికి వెళ్లేందుకు తిరుగు ప్రయాణం అయ్యారు. పెద్దపాళ్యం మీదుగా జాతీయ రహదారిపై అంగళ్లు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో మండలంలోని కోటిరెడ్డిగారిపల్లి వద్ద తమిళనాడుకు చెందిన లారీని డ్రైవర్ రోడ్డుపక్కన నిలిపి ఉంచాడు. అంగళ్లు వైపు బొలెరో వాహనం నడుపుతూ వస్తున్న డ్రైవర్ ఫయాజ్ మలుపు వద్ద ఎదురుగా నిలిపి ఉన్న లారీని గుర్తించలేకపోయాడు. దీంతో నేరుగా లారీ వెనుక వైపు బొలెరో వాహనం ఢీకొంది. బొలెరో ధ్వంసమై అందులోని ఫయాజ్, మహేంద్రకు శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే ఇద్దరూ దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రే ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఒకే ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబాల వారు తీవ్ర ఆవేదనతో విలపించారు.
ఇద్దరు దుర్మరణం
మృతులు రాయచోటి వాసులు
Comments
Please login to add a commentAdd a comment