మాజీ సైనికులకు వైవీయూ సత్కారం
కడప ఎడ్యుకేషన్ : భారత సాయుధ దళాల్లో సేవలు అందించి భారత రాష్ట్రపతి మెడల్స్ అందుకున్న సైనికులను, వివిధ దశల్లో జరిగిన యుద్ధాల్లో కీలక భూమిక పోషించిన సైనికులను గుర్తించి యోగి వేమన విశ్వవిద్యాలయం గణతంత్ర వేడుకలకు ఆహ్వానించింది. ఈ మేరకు మాజీ కెప్టెన్ జానకి రామ్, మాజీ కెప్టెన్, ఎస్.ఎస్.రాముడు, మాజీ సుబేదార్ నాగరాజు, మాజీ ఎస్జీటీ ఎ.వెంకటేశు, మాజీ నాయక్ పి.కృష్ణయ్య, మాజీ సప్పర్ తిప్పిరిపాటి సైలస్, మాజీ హవల్దారు నాగన్న, మాజీ ఎస్జీటీ బి.వి.గోపాల్‌రెడ్డి, మాజీ నాయక్ పి.లక్ష్మినారాయణలకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కృష్ణారెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ పి.పద్మ, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్.రఘునాథరెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ శాఖ సంచాలకులు డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి సెల్యూట్ చేసి సత్కరించారు. అనంతరం మాజీ సైనికుల సేవలను నిర్వాహకులు కీర్తించారు. వివిధ యుద్ధ సమయాల్లో పోషించిన పాత్రను మాజీ సైనికులు వెల్లడించారు. తల్లి ఒంటిమీద చిన్న గీత పడితే బిడ్డగా మనం ఎలా ఆక్రోశిస్తామో మన ధరిత్రి మీద ముష్కరుల నీడపడినా భారతదేశ సైనికులుగా, దేశ పౌరుడిగా కన్నెర్ర చేశామని వారు పేర్కొన్నారు. ఆ ఘటనల్లో శరీరంలో కొన్ని భాగాలు కోల్పోయామన్నారు. అయినా ఎనలేని తృప్తి పొందామన్నారు. త్రివిధ దళాలలోకి యువత రావాలని వారు ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment