అన్ని ప్రేమకథల్లాగే ఆ లవర్స్ కి పెద్దలు అడ్డుతగిలారు .పెళ్లైన అమ్మాయితో ప్రేమాయణం ఏంటని నిలదీశారు. తెగతెంపులు చేసుకోవాలని హుకుం జారీ చేశారు .మనస్తాపానికి గురైన ప్రేమజంట ఎగిరిపోయింది. చావుతోనైనా ఒకటవ్వాలని నీటిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందగా ప్రియురాలు ప్రాణాలతో బయటపడింది .
సాక్షి, పశ్చిమగోదావరి : ప్రేమకోసం ప్రాణం తీసుకొని కన్నవారికి కడుపుశోకం మిగిల్చిన ఇతని పేరు కొమ్ము సురేష్. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని ప్రగడవరం నివాసి. అదే గ్రామానికి చెందిన వివాహిత రాయల్ నాగమణిపై మనసు పడ్డాడు. భర్తతో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా ఉన్న నాగమణికి తోడుగా ఉంటానని వెంటపడ్డాడు. నాగమణి బిడ్డకు తండ్రిలేని లోటు తీరుస్తానని బాసచేసాడు. దాంతో వయసులో చిన్నవాడైనప్పటికీ సురేష్ లవ్ ప్రపోజల్‌కి నాగమణి ఓకే చెప్పింది. ఇ
ద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇద్దరిమధ్యా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈనేపథ్యంలో ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే, సురేష్ కుటుంబ సభ్యులు నాగమణితో పెళ్లికి ససేమిరా అన్నారు. వయసులో పదేళ్లు పెద్దది, ఒక బిడ్డకి తల్లి అయిన వివాహితతో పెళ్లేంటని మందలించారు. వారికి నచ్చచెప్పేందుకు సురేష్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో మనస్తాపానికి గురైన సురేష్ ప్రియురాలు నాగమణితో విషయం చెప్పాడు. ఇద్దరూ ఊరినుంచి పారిపోయారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం తమ్మిలేరు రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.
చావులోనైనా కలిసి ఉండాలని భావించారు. అయితే, ప్రేమ జంట నీటిలో దూకడం చూసిన మత్స్యకారులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. నీట మునిగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నాగమణిని కాపాడారు. కానీ, సురేష్ మాత్రం గల్లంతయ్యాడు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నాగమణిని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకుని విచారణ ప్రారంభించారు. గజ ఈతగాళ్లని రిజర్వాయర్‌లోకి దింపి సురేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. కాటికి పంపాల్సిన కొడుకు కడుపుకోత మిగిల్చాడని అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు.