ఆడపిల్ల అంటే ‘ఆడ..’పిల్ల అనే రోజులు పోయాయి. ప్రతి ఇంటా మహాలక్ష్మిలా ఆడపిల్ల ఉంటేనే అచ్చమైన కళ అనే రోజులొచ్చాయి. నిజమే.. జాతీయ కుటుంబ సర్వే ఇటీవల సర్వేలో చాలామంది ఆడపిల్లలు కనడానికే ఓటేశారు. మగపిల్లలెందరున్నా ఆడపిల్ల ఉంటే ఆ ముచ్చట వేరంటూనే, భవిష్యత్తు బాలికలేదనని సర్వేలో స్పష్టంగా తెలియజేశారు.
సాక్షి, విజయవాడ: పండంటి ఆడపిల్ల అనగానే ‘హూ..’ అంటూ నిట్టూర్చే వారు చాలామందే ఉన్నారు. ఇక ఆడపిల్ల పుట్టింది అని తెలియగానే చెత్తకుప్పలు, ముళ్లపొదల్లో పడేసే వారికి కొదవే లేదు. కానీ, ఆడపిల్ల అంటే ఆదిమహాలక్ష్మి అని భావించేవారూ లేకపోలేదు. ఇటీవల విజయవాడ నగరంలో జరిగిన కుటుంబ సర్వే ఈ విషయాలను తేటతెల్లం చేసింది. నిజమే.. దేశంలోని 79 శాతం మంది మహిళలు (15–49 ఏళ్లవారు), 78 శాతం పురుషులు (15–54 వయసువారు) కనీసం ఒక్క ఆడపిల్ల అయినా కావాలనుకుంటున్నారంటే నమ్మితీరాలి. 74 శాతం మంది మహిళలు, 65 శాతం మంది పురుషులు తమకు ఆడపిల్ల కావాలని కోరుకున్నారు.
మారిన గ్రామీణం
చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లను ఒప్పుకోరు. తాజా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోనే ఆడపిల్లల సంఖ్య పెరుగుతోందని తేలింది. నగర ప్రాంతాల్లోని 75 శాతం మహిళలు తమకు ఆడపిల్ల కావాలని కోరుకుంటుంటే, గ్రామాల్లో 81శాతం మహిళలు తమ ఇంట్లో ఒక మహాలక్ష్మి ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నారు. కనీసం ఇంటర్ వరకూ చదువుకున్న మహిళల్లో 72 శాతం మంది ఆడపిల్ల కావాలని కోరుకుంటే, నిరక్షరాస్యుల్లో 85శాతం మంది ఆడశిశువు కోసం పరితపిస్తుండటం విశేషం.
లేడీస్ ఫస్ట్
పదేళ్లనాటి సర్వేతో పోల్చుకుంటే.. బాలికల్లో చదువుకుంటున్న వారి శాతం 55.1 నుంచి 68.4కి పెరిగింది. చదువుకున్న మహిళలైతే ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెడుతుంటే, నిరక్షరాస్యులైన మహిళలకు ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటున్నారు. కిందటి కుటుంబ సర్వేలో లక్షా 9వేల కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈసారి సర్వేలో 2,68,200 కుటుంబాలను సర్వే చేశారు.
అక్షరాస్యత పెరగడం వల్లే..
శిశువుల మరణాల్లోని కీలక అంశాలను కూడా జాతీయ కుటుంబ సర్వే గుర్తించింది. విద్యావంతులైన మహిళలు కుటుంబ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్న ఇళ్లల్లో శిశు మరణాలు తక్కువగా నమోదయ్యాయి. ఒకప్పుడు ప్రతి వెయ్యి మందిలో 79 మంది పిల్లలు చనిపోతుండగా, ఇప్పుడా సంఖ్య గణనీయంగా తగ్గిందని సర్వే గుర్తించింది. పుట్టిన పిల్లలకు సమయానికి వ్యాక్సిన్లు వేయించకపోవడం, పోషకాహారం ఇవ్వకపోవడం వల్ల శిశుమరణాలు ఇప్పటికీ నమోదవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment