– వనిత దాట్ల, వైస్ చైర్‌పర్సన్, ఎలికో లిమిటెడ్. రీజనల్ చైర్‌ఉమన్, సిఐఐ–ఐడబ్లు్యఎన్ (సదరన్ రీజియన్)
ప్రపంచంలో 50 శాతం మహిళలే. అయితే మహిళలకు అవకాశాలు మగవారితో పోలిస్తే సమానంగా ఉండటం లేదు. దీనికి కారణం... ప్రతి రంగంలో ఆడవాళ్లకంటే మగవాళ్లు ఎక్కువగా ఉండటమే.
ఒక సంస్థను నడిపించడానికి తీసుకునే నిర్ణయాలలో గానీ, చట్టాలు, విధానాలను సూత్రీకరించడంలో కానీ ఆడవాళ్ల ఇన్‌పుట్స్‌ను ఆహ్వానించడం తక్కువగా ఉంటోంది. ఆడవాళ్ల దృష్టి కోణం వాళ్లు మాట్లాడినప్పుడే వస్తుంది. మగవాళ్లు ఎంత విశాలంగా ఆలోచించినా ఆడవాళ్లలాగ ఆలోచించలేరు. ఆడవాళ్లకు ఏమి అవసరమో ఊహించి చట్టాలు, విధానాలు చేయలేరు మగవాళ్లు. ఆడవాళ్ల అవసరాల గురించి వాళ్లకు అర్థమైనట్లు తోచినట్లు సమకూర్చుకుంటారు. ఆ చట్టాలు, విధానాలకు అనుగుణంగానే ఆడవాళ్లు మెలగాల్సి వస్తోంది.
ఆడపిల్లలు చాలా బాగా చదువుకుంటారు. కానీ... అనేక కారణాల వల్ల ఉద్యోగరంగంలో, విభిన్న రంగాలలో పై స్థాయికి ఎదగలేక పోయేసరికి మగవారితో సమాన ఆర్థిక పరమైన వ్యవస్థ సొంతంగా కలిగించుకోలేకపోతున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి మహిళలు కూడా ఆ బాధ్యత మగవాళ్లకే వదిలేశారు. అందుకే ఇప్పుడు పరిస్థితి ఇలాగ ఉంది. ఇక మీదట కూడా వాళ్లకే వదిలేస్తే మనదేశం ముందుకి వెళ్లదు. దేశం అభివృద్ధి చెందలేదు.
‘ఆడపిల్లలకు కూడా ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది’... అనుకోవాలి, నేర్పించాలి కూడా. ఊరికే డిగ్రీలు సంపాదిస్తే చాలదు. మహిళల తెలివితేటలు, సమర్థతలు దేశాభివృద్ధికి దోహదం చేయాలి. అలాగే ప్రతి ఒక్క మహిళ... ఏదో ఒక విషయంలో సాటి మహిళను ప్రభావితం చేయగలగాలి. మహిళాలోకానికి దిక్సూచి కావాలి.
మునుపటి రోజుల్లో ఏ దేశానికి భౌతిక వనరులు సమృద్ధిగా ఉండేవో ఆ దేశాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉండేది. నేటికాలంలో ఏ దేశానికి మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయో ఆ దేశం ముందుకి వెళ్లటానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. మనదేశానికి ఉన్న పెద్ద ప్రయోజనం మన మానవ వనరులే. అందులో సగభాగం మహిళలే. మహిళాశక్తిని వినియోగించుకుంటే దేశం త్వరితంగా వృద్ధి చెందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఉపయోగించుకుంటేనే మహిళాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమవుతాయి. అప్పుడే ఈ తరం మహిళలు భవిష్యత్తు తరాల మహిళలకు చక్కటి దారిని వేసినట్లవుతుంది. ఆడ, మగ సమానత్వం గురించి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. ఆపైన స్వావలంబన, సాధికారత అనే మాటల అవసరమే ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment