ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): ‘ఆదరణ’ పథకం లబ్ధిదారులందరికీ ఇంకా అందలేదు. పనిముట్ల పంపిణీలోజాప్యంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.30 వేలు ప్రతి లబ్ధిదారుడికి మంజూరు చేయాలి. ఆ నిధులకు సమానంగా విలువ చేసే పనిముట్లను పలు వృత్తులకు చెందిన లబ్థిదారులు ఎంచుకోవాలి. వాటిని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది.
ముందు నుంచీ గందరగోళమే..
లబ్ధిదారుల ఎంపికలో తొలి నుంచి గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు విశాఖ జిల్లాకు టార్గెట్లు మార్చిన ప్రభుత్వం ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడానికి మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. తొలుత జిల్లాకు 27 వేల యూనిట్లు కేటాయిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. అనంతరం ఆ సంఖ్యను ఏకంగా 65 వేల యూనిట్లకు పెంచుతూ జిల్లా బీసీ సంక్షేమశాఖకు లబ్ధిదారులను చేర్చే బాధ్యత అప్పగించింది. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం లబ్ధిదారులు బ్యాంకు చెల్లించే 10శాతం నిధుల్లో రాయితీ కల్పించింది. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ముందస్తు డిపాజిట్ లేకుండా పనిముట్లు పంపిణీ చేస్తామని వెల్లడించింది. దీంతో వేల సంఖ్యలో లబ్ధిదారులు పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా పనిముట్లు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పనిముట్లకు ఎంపికైన వారి జాబితాను ఇంటర్‌నెట్‌లో పెట్టి నెలలు గడుస్తున్నా ఇంకా అందకపోవడం లబ్ధిదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
14 వేల మందికే లబ్ధి
జిల్లా నుంచి 41,977 మంది ఆదరణ పథకం ద్వారా పనిముట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 37,569 మంది ఎంపికైనట్లు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అయితే ఇందులో పనిముట్లు వచ్చిన వారు 23 వేల మంది వరకు ఉన్నారు. వీరిలో కేవలం 14 వేల మందికి మాత్రమే ఇప్పటి వరకు అందజేశారు. 9 వేల మందికి వరకు పనిముట్లు వచ్చినప్పటికీ ఇంకా పంపిణీ చేయలేదు. ఇంకా 18 వేల మంది వరకు పనిముట్లు కాంట్రాక్టర్ నుంచి జిల్లాకు చేరాల్సి ఉంది.
కాంట్రాక్టర్లు అందజేయాలి
దీనిపై జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులను సంప్రదించగా పనిముట్లు అందించడంలో కొంతమేర జాప్యం జరుగుతుందన్నారు. పనిముట్లు అందజేసే కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం పలువురికి ఇచ్చినట్లు తెలిపారు. ఆయా కాంట్రాక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పనిముట్లు అందజేయాల్సి ఉండటంతో కొంత జాప్యం జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment