ప్రమాదమా.. దాడి చేశారా? | Accident or Had the attack? | Sakshi
Sakshi News home page

ప్రమాదమా.. దాడి చేశారా?

Published Fri, Jun 19 2015 3:37 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ప్రమాదమా.. దాడి చేశారా? - Sakshi

ప్రమాదమా.. దాడి చేశారా?

♦ కాలిన గాయాలతో  అపస్మారక స్థితిలో బాలిక ఆసుపత్రికి తరలింపు
♦ ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందన్న పోలీసులు
యాసిడ్ దాడి జరిగి  ఉండవచ్చని వైద్యుల అనుమానం
సమగ్ర దర్యాప్తుతోనే   వాస్తవాలు వెల్లడయ్యే  అవకాశం
 
 దర్యాప్తులోనే వాస్తవాలు వెల్లడి..
బాలిక తీవ్రంగా గాయపడిన సంఘటనపై అటు పోలీసులు, ఇటు వైద్యులు ఎవరి పరిధిలో వారు ఊహాజనితమైన అంచనాకు వస్తున్నారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. బాలిక గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించడంతో ఆమె ఒంటిపై ఉన్న గాయాల తీవ్రత తదితర అంశాలను పరిగణలోకి దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దీంతో పాటు బాలిక స్పృహలోకి వచ్చాక ఏం చెబుతుందనే దాన్నిబట్టి వాస్తవాన్ని గుర్తించవచ్చు. అంతవర కు ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక దాడి చేశారా అనేది మిస్టరీగానే ఉండిపోతుంది.
 
 క్రైం(కడప అర్బన్)/రామాపురం : రామాపురం మండలం సూరపువాండ్లపల్లెకు చెందిన మడక సుజన(16) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఈమెపై ఎవరైనా యాసిడ్‌తో దాడి చేశారా.. లేక ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్ పేలి అందులోని ఆయిల్ ఈమెపై పడి కాలిందా అనేది అర్థం కావడం లేదు. వివరాల్లోకెళితే.. రామాపురం మండలం సూరపువాండ్లపల్లెకు చెందిన మడక నారాయణ, లక్ష్మినరసమ్మల నాలుగో కుమార్తె సుజన ఇటీవలే పదో తరగతి పాసైంది. రాయచోటిలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో చేరే ందుకు సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో తన రెండవ సోదరి రాయచోటిలోని ఓ ఆసుపత్రిలో ప్రసవించడంతో ఆమెను చూసేందుకు తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. గురువారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో తమ జీవనాధారమైన గొర్రెలు, మేకలు మేపేందుకు ఆమె గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత కొద్ది సేపటికి తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె ఇంటికి చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన బంధువులు వెంటనే రాయచోటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలతో బాలిక అపస్మారక స్థితిలో ఉండటంతో అక్కడి వైద్యుల సూచనమేరకు ఆ తర్వాత కడప రిమ్స్‌కు తరలించారు. రాయచోటి వైద్యులు మాత్రం యాసిడ్ దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఏఎస్పీ అన్బురాజన్ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

 ఏం జరిగిందో తెలీడం లేదు: బాలిక తల్లిదండ్రులు
 సుజన తల్లిదండ్రులు ఈ సంఘటన గురించి మాట్లాడుతూ ఏం జరిగిందో.. ఎలా జరిగిందో.. తమకు తెలియడం లేదన్నారు. తాము రాయచోటిలో ఉండగా తమ కుమార్తెను బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. తమకు ఎవరూ శత్రువులు లేరని, ఎవరు దాడికి పాల్పడ్డారో, ఏ వస్తువుతో దాడి చేశారనేది పోలీసులే తేల్చాలన్నారు. తమ కుమార్తె గొర్రెలు మేపుకుంటున్న సమయంలో అక్కడ ఎలాంటి విద్యుత్ తీగలుగానీ, ట్రాన్స్‌ఫార్మర్లుగానీ అందుబాటులో లేవని తెలిసిందన్నారు.

 రిమ్స్ వైద్యులు ఏమంటున్నారంటే!
 ఈ సంఘటనపై రిమ్స్ ఆర్‌ఎంఓ డాక్టర్ కొండయ్య, సర్జన్ అమానుల్లాలు మాట్లాడుతూ బాలిక శరీరంపై గాయాలను బట్టి యాసిడ్‌గానే అనుమానిస్తున్నామని, పూర్తిగా తెలియాలంటే బాలిక కోలుకున్న తర్వాత, ఆమె చెప్పే విధానాన్ని బట్టి నిర్ధారించవచ్చన్నారు.

 ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ వల్లే గాయాలు: ఏఎస్పీ అన్బురాజన్
 ట్రాన్స్ ఫార్మర్‌లో మంటలు రేగి ఆయిల్ మీద పడటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు.  సంఘటనకు సంబంధించి ఆ గ్రామంలోని ప్రజలతో మాట్లాడామని, అలాగే ఆసుపత్రికి వెళ్లి గాయపడిన బాలికను పరిశీలించామని, అక్కడి వైద్యులతో కూడా చర్చించామని ఆయన తెలిపారు.

 రామాపురం ఎస్‌ఐ వివరణ
 రామాపురం ఎస్‌ఐ వెంకటా చలపతి ఈ సంఘటనపై మాట్లాడుతూ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లామని, అక్కడ యాసిడ్ బాటిల్ ఆనవాళ్లు లేవన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement