సదా మీ సేవలో | allways we are providing services | Sakshi
Sakshi News home page

సదా మీ సేవలో

Published Sun, Feb 1 2015 10:53 AM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

allways we are providing services

- ఫోన్ చేస్తే చాలు సమస్యలను పరిష్కరిస్తా
- అర్హులందరికీ ఇళ్లను హౌసింగ్ శాఖ ద్వారా నిర్మిస్తాం
- చేనేత వృత్తిదారుల్లో 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు అందజేస్తాం
- చేనేత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేస్తాం
- నాణ్యమైన చీరలు నేస్తున్నా దళారుల వల్ల నష్టపోతున్నాం


 
నేత వృత్తి ఆధారంగా జీవనం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వ పరంగా అందే సౌకర్యాలన్నీ నేరుగా వారికే అందజేసేలా చర్యలు తీసుకుంటా.. అలాగే కష్టాల్లో ఉన్న నేత కార్మిక కుటుంబాలకు అండగా నిలబడతానంటున్న చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పి. సత్యనారాయణరావు శనివారం కోడుమూరు పట్టణం కొండపేటలోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాసుఖాలను అడిగి తెలుసుకున్నారు. చితికిపోతున్న నేత బతుకులు ఎంత అధ్వానంగా ఉన్నాయో స్వయంగా తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారి కోడుమూరు పట్టణంలో పర్యటించి.. మగ్గాలు నేస్తున్న కార్మికులను పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ చేనేతల గడపగడపను తట్టారు. మీకు ఎలాంటి కష్టమొచ్చినా తనకు ఫోన్ చేస్తే చాలు.. మీ సమస్యకు పరిష్కారం చూపుతానని వారికి భరోసా ఇచ్చారు. అలాగే చేనేత కార్మికుల రుణాలకు సంబంధించిన సమస్యపై కోడుమూరు స్టేట్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్ మేనేజర్లతో చర్చలు జరిపి దాదాపు 800 మందికి రుణాలు అందేవిధంగా వారితో హమీ తీసుకున్నారు.
 
 ఏడీ : అమ్మా మీ పేరేంటి? మీ సమస్యలేంటి?
 వృద్ధురాలు : సార్, నా పేరు రామలక్ష్మి. చేనేత గుర్తింపు కార్డు రాలేదు.
 ఏడీ : మీ ఇంట్లో మగ్గం ఉందా?
 రామలక్ష్మి : ఉంది సర్, దానిమీద పట్టు చీరలు నేస్తాము. అయినా ఇప్పటి వరకు మాకు చేనేత గుర్తింపు కార్డులు ఇవ్వలేదు.
 ఏడీ : ఇప్పుడు ఇంటింటి సర్వే చేయిస్తున్నాం. అందులో మీ వివరాలు నమోదు చేయించి.. మీరు నిజంగా చేనేత కార్మికులు అయితే కార్డులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటాను.
 
 ఏడీ : మీ పేర్లేంటమ్మా.. మీ సమస్యలేమైనా చెబుతారా?
 మహిళలు : సార్, నా పేరు నాగమ్మ.. నా పేరు వెంకమ్మ. మా ఇద్దరికి పింఛన్లు రావడం లేదు. చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం..
 ఏడీ : 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పింఛన్లు వస్తాయి. మీకు రాకపోవడానికి కారణాలేంటో తెలుసుకుంటా.
 వృద్ధుడు : సార్, చేనేత కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి? మీరే వాటికి పరిష్కారం చూపించాలి..
 ఏడీ : పెద్దాయన నీ పేరేంటి? చేనేత కార్మికులకు సంబంధించి సమస్యలు తెలుసుకునేందుకే  ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఇక్కడికి వచ్చాను. చెప్పండి మీ సమ్యలేంటో?
 వృద్ధుడు : నా పేరు ఆదేష్ రాజు. సర్ గతంలో ఐసీఐసీఐ లాంబార్డు ఇస్తున్న ఆరోగ్య బీమా పథకం రద్దు చేశారు. దీంతో చేనేత కార్మికులు ఈ ఏడాది ఆరోగ్య బీమా పథకానికి దూరమవుతున్నారు. సిల్క్‌పై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీ రూ. 600 నుంచి రూ. 1,000 పెంచితే కార్మికులకు మేలు జరుగుతుంది.
 ఏడీ : ఐసీఐసీఐ లాంబార్డు ఆరోగ్య బీమా పథకం ఈ ఏడాది డిసెంబరు నెలాఖరున రద్దు చేశారు. ఆ స్థానంలో రాష్ట్ర స్వస్థ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. ప్రస్తుతం రూ. 15వేలు ఉన్న బీమా కాస్త రానున్న రోజుల్లో రూ. 30 వేలు కానుంది. ఇక సిల్క్‌పై సబ్సిడీ పెంచే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్తాం.
 
 ఏడీ : అమ్మా మీ సమస్య ఏంటి?
 లక్ష్మిదేవి : నా భర్త చనిపోయి 30 ఏళ్లు అవుతోంది. చేనేత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. గతంలో నాకు రూ. 200 పింఛను వచ్చేది. ప్రస్తుతం దాన్ని నిలిపివేశారు. నా భర్త చనిపోయిన సర్టిఫికెట్ అడుగుతున్నారు. ఆ సర్టిఫికెట్ నేను ఎక్కడ తెచ్చేది. మీరే నాకు సాయం చేయాల.
 ఏడీ : మీ సమస్యను డీఆర్‌డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. వారితో మాట్లాడి పింఛను వచ్చే ఏర్పాట్లు చేయిస్తాను.
 సీబీ లత, సర్పంచ్ : ఏడీ సార్, కోడుమూరు పట్టణంలో 2 వేల మగ్గాలు ఉన్నాయి. గద్వాల బ్రాండ్ పట్టుచీరలు నేస్తున్నారు. అయితే మార్కెటింగ్ సౌకర్యంలేక చేనేత కార్మికులు తయారుచేసిన చీరలను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ముడిసరుకుల ధరలూ పెరిగిపోయాయి. బ్యాంక్‌లో అప్పులు రెన్యువల్ చేయడంలేదు. సిల్క్, కాటన్‌పై సబ్సిడీలు పెంచితే బాగుంటుంది. గతంలో ఇక్కడ 250 మంది చేనేతకార్మికులకు బ్యాంకులు రుణాలు అందజేశాయి. ఇప్పుడు వాటిని రెన్యువల్ చేయడం లేదు. బ్యాంకు అధికారులతో మాట్లాడి వీరికి న్యాయం జరిగేలా చూడండి.

 ఏడీ : పట్టు పరిశ్రమశాఖ చేనేత కార్మికులకు కిలోకు రూ. 150 చొప్పున నెలకు 4 కిలోల సిల్క్‌పై రూ. 600 వరకు సబ్సిడీ ఇస్తోంది. కాటన్‌పైనా కోడుమూరులోనే యారన్ డిపోలో కొనుగోలు ధరపై 10 శాతం తగ్గించి విక్రయిస్తారు. రుణాల విషయంలో ఈ రోజే(శనివారం) బ్యాంకు అధికారులతో మాట్లాడుతాను.  
 ఏడీ  : ఏమయ్యా మగ్గం నేస్తున్నావా, నీ పెరేంటీ, చేసే పని గిట్టుబాటు అవుతుందా , ఎన్నేళ్లు  నుంచి ఈ వృత్తిలో ఉన్నావు.
 మాధవస్వామి : పింఛన్లు రావడంలేదు, ఇన్సూరెన్స్ కార్డుల సమయం ముగిసిపోయింది. బ్యాంక్ రుణాలు రావడంలేదు. రుణాల కోసం ఎన్నిసార్లు ధరఖాస్తులు పెట్టుకున్న బ్యాంక్ అధికారులు పట్టించుకోవడంలేదు. 850 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు పట్టించుకోవడంలేదు. చేనేతలంటే అప్పులు కట్టరని బయటికి పంపుతున్నారు. నోటీసులిచ్చి పరువు తీస్తున్నారు. ముడిసరుకు సబ్సిడీ సరిగా రావడంలేదు. మా బతుకులు ఇవీ. సమస్యలు పరిష్కరించి మా బతుకుల్లో వెలుగు నింపండి.
 ఏడీ : జీవిత బీమా సౌకర్యం పెంచి ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. అప్పుడు మళ్లీ అందరికీ జీవిత బీమా కార్డులు అందజేస్తాం. రుణాల గురించి బ్యాంకు అధికారులతో మాట్లాడి మీకు రుణాలు అందించేలా చూస్తాను. తీసుకున్న రుణాలు కూడా సక్రమంగా చెల్లించాలి.
 
 ఏడీ : అయ్యా నీవు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పు?
 శీలప్ప : కరెంట్ మగ్గాలు వచ్చి మా బతుకులను నాశనం చేశాయి. 25 సంవత్సరాల నుంచి మగ్గం నేస్తున్నా. బ్యాంక్‌లో అప్పులివ్వడంలేదు. ఎన్నిసార్లు ధరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడంలేదు. జిరాక్స్ కాగితాలకే మా డబ్బులన్ని సరిపోతున్నాయి.
 ఏడీ : బ్యాంకర్లతో మాట్లాడి చేనేత కార్డులున్న వారందరికీ రుణాలు ఇప్పిస్తాం. ధరఖాస్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరంలేదు. అర్హులైనవారందరికీ రుణాల ధరఖాస్తులు చేనేత కార్యాలయం నుంచి  ఉచితంగానే అందజేస్తాం. రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఇస్తే చాలు.
 
 చేనేత కార్మికుడు : సార్, నాపేరు శివయ్య, కాటన్ చీరలకు, చిన్న మగ్గాలకు సబ్సిడీ తీసేశారు. హెల్త్ కార్డులు కుటుంబంలో నలుగురికే ఇస్తున్నారు. మీగతా వారి పరిస్థితి ఏమిటి, దళారుల బెడద ఎక్కువైంది.
 ఏడీ : దళారీ వ్వవస్థను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టింది. ప్రతి చేనేత కార్మికుల్ని గుర్తించాలన్నదే ఈ సర్వే ఉద్ధేశ్యం. భవిష్యత్తులో అర్హులైన చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందజేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.  సర్వే కోసం వచ్చిన వారిని కలిసి తమ మగ్గాల ఫోటోలు తీయించుకొని, బ్యాంక్ ఖాతా నెంబర్లు ఇవ ్వండి. నేత పనిమీద ఆధార పడ్డావారిని ఆదుకుంటాం. చేనేతల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినా జీవిత భీమాకు ప్రతి ఒక్కరూ రూ.80 చెల్లించండి.
 
 ఏడీ : పెద్దాయన ఆరోగ్యం బాగుందా.. పనిచేయడం చేతనవుతుందా.. నీ వయసెంత?
 చిన్న తిప్పన్న : కళ్లు కనిపించడంలేదయ్యా, చేనేత కార్డు లేదని పింఛన్ ఇవ్వడంలేదు. పేరు తప్పుందని రూ.1000 పింఛన్ తీసేశారు. గతంలో రూ.200 పింఛన్ అందుతుండేది. ఇప్పుడు పెంచిన పింఛను అందడం లేదు.
 ఏడీ : పెద్దాయన, సర్వే ముగిసిన తరువాత చేనేత కార్డు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లితే ఉచితంగా కంటి చికిత్సలు చేసి కళ్లద్దాలు ఇస్తారు. కుటుంబ సభ్యులు ఇతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లండి.
 
 నాగరాజు : కేంద్ర ప్రభుత్వం నూలు కొనుగోలు కోసం ఇచ్చే రూ.600 సబ్సిడీ రావడంలేదు. చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా.
 ఏడీ : పట్టుపరిశ్రమ శాఖ అధికారులతో మాట్లాడి గుర్తింపు కార్డు ఉన్నా వారందరికీ ముడిసరుకు సబ్సిడీని ఇప్పించేందుకు కృషి చేస్తా.
 
 క్రిష్ణ : ఎంతో నాణ్యత , నైపుణ్యంతో మగ్గాలు నేస్తున్నారు. కోడుమూరులో తయారయ్యే చీరలకు ఒకప్పుడూ ఎంతో పేరుండేది. కరెంట్ మగ్గాలు రావడంతో చేనేత మగ్గాలు పూర్తిగా పడిపోయి కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ వృత్తిని వదిలేసి హోటళ్లు, దుకాణాలలో పనులు చేసే పరిస్థితి ఏర్పడింది. అప్పులు తీర్చలేక మూడు, నాలుగేళ్ళలో దాదాపు 30 మంది కార్మికులు చనిపోయారు. మగ్గం పని గిట్టుబాటు కాదని మగ్గాలు తీసేసి వేరే పనులకు వెళ్తున్నారు. అధికారులు కార్మికుల కష్టాలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయండి.
 
 ఏడీ : ఇక నుంచి అంతా పారదర్శకంగా ఉంటుంది. చేనేత కార్మికుల పేర్లన్ని ఆన్‌లైన్‌లో నమోదు అవుతాయి. బోగస్ లబ్ధిదారులను అరికట్టేందుకు సర్వే జరుగుతోంది. మగ్గం ఉన్నవారికే ప్రభుత్వ రాయితీలు అందుతాయి. మార్చి వరకు సర్వే జరుగుతుంది. ఇప్పటివరకు 1200 మంది కార్మికులను గుర్తించాం. అందరి పేర్లు నమోదయ్యేలా చూసుకోండి. సిల్క్ సబ్సిడీ అందరికీ అందేవిధంగా సిరికల్చర్ అధికారులతో మాట్లాడుతాం. దళారులను ఆశ్రయించవద్దు. నాకు ఫోన్(8008705739) చేస్తే చాలు మీ పనులు చేసి పెడతాం. ఇక్కడ కార్మికుల అవసరాల కోసం నర్సింహరెడ్డి అనే అధికారిని ఏడీగా నియమించాం. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement