ప్రయివేటు తోవ! | Anantapur govt hospital plagued by staff crunch | Sakshi
Sakshi News home page

ప్రయివేటు తోవ!

Published Fri, Sep 29 2017 12:34 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

Anantapur govt hospital plagued by staff crunch - Sakshi

ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో పని చేసే ఫిజీషియన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలైతే చాలు అక్కడ ప్రత్యక్షమవుతారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లతో సత్సంబంధాలున్న ఈ డాక్టర్‌ కొన్ని రకాల పరీక్షలను సైతం అక్కడకు పంపుతుంటారు. ఆరోగ్యం సరిగా లేని కేసులను ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోనే ఉన్న రెండు ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తుంటారు.

ఆస్పత్రిలో పని చేసే ఓ గైనకాలజిస్ట్‌ తీరు మరీ ఘోరం. ఈమె భర్త ఆస్పత్రిలోనే ఓ విభాగంలో పని చేస్తుంటారు. నగరంలో ఓ క్లినిక్‌ ఉంది. సుమారు ఆరేడు ఆస్పత్రులకు కన్సల్టెంట్‌గా వెళ్తుంటారు. ఆస్పత్రి వేళల్లో కూడా ప్రైవేట్‌ సేవలో తరిస్తుంటారు.

ఆర్థో విభాగంలో పని చేస్తున్న చాలా మంది డాక్టర్లకు ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వర్తిస్తుండడంతో వీరికి కాసుల పండగే. ఓపీలో కేసులను చూడడం, అవసరమైతే అడ్మిట్‌ చేసుకుని ఆ తర్వాత బయటి ఆస్పత్రులకు రెఫర్‌ చేయడం పరిపాటి. ప్రాణ భయంతో చాలా మంది డాక్టర్లు చెప్పినట్లు     వెళ్లిపోతుంటారు.

మృత్యువు ముఖంలోకి వెళ్లిన వారికి ప్రాణం పోసే శక్తి ఒక్క వైద్యునికే ఉంది. అందుకే వైద్యులను ప్రత్యక్ష దైవం అంటారు. రోగుల ప్రాణాలు కాపాడే విషయంలో అహర్నిశలు శ్రమించే వైద్య వృత్తిలో కొందరి తీరు వివాదాస్పదమవుతోంది. మానవత్వం స్థానంలో వ్యాపారం అధికమైంది. కార్పొరేట్‌ వైద్యం రాకతో ప్రాణం విలువ తరిగిపోతోంది. ఇక పేదలకు పెద్ద దిక్కుగా నిలుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కొందరు వైద్యులు సొంత లాభం చూసుకుంటున్నారు. ప్రయివేట్‌ సేవలో తరిస్తూ వైద్య వృత్తికే మాయని మచ్చగా నిలుస్తున్నారు.

అనంతపురం మెడికల్‌:
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నిత్యం 2వేల మందికి పైగా ఓపీ ఉంటుంది. 1000 వరకు ఇన్‌పేషెంట్స్‌ ఉంటారు. మొత్తం 241 మంది వైద్యులు అవసరం కాగా.. 70 వరకు ఖాళీలు ఉన్నాయి. ఉన్న వారిలో 90 శాతం మంది ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. కొందరు సొంతంగా ఆసుపత్రులు.. మరికొందరు.. క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రులకు కన్సల్టెంట్స్‌గా వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం సొంత ప్రాంతాల్లోనే నివాసం ఉండాల్సి ఉన్నా.. కొందరు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరు వైద్యులు ఏకంగా కర్నూలు నుంచి రాకపోకలు సాగిస్తుండటం గమనార్హం. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు సర్వజనాస్పత్రిలో వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఈ రెండు సమయాల్లోనూ బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి. తెలివి మీరిన చాలా మంది డాక్టర్లు బయోమె‘ట్రిక్‌’ ప్రదర్శిస్తున్నారు. సమయానికి రావడం.. హాజరు వేసి రెండు గంటలు ఉండటం.. ఆ తర్వాత ‘సొంత’ పనికి వెళ్లడం.. సాయంత్రం వచ్చి మళ్లీ హాజరు వేసి వెళ్లిపోవడం.. ప్రతి రోజూ ఇదే తంతు.

థియేటర్‌ చార్జీలు చెల్లిస్తూ..
సర్వజనాస్పత్రిలో పని చేస్తున్న కొందరు వైద్యులు శస్త్ర చికిత్సలను సైతం తాము ఒప్పందం చేసుకున్న ఆస్పత్రుల్లో చేస్తున్నారు. థియేటర్‌ చార్జీలు ఆస్పత్రులకు చెల్లించి వైద్యుల చార్జీలను జేబులో వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సమయానికి నాడి పట్టే వారు కరువవుతున్నారు. నిరుపేదలు వైద్యం కోసం వస్తే 24 గంటలు గడవక ముందే ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న దారుణ పరిస్థితి ఉంది. అయినా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ వస్తున్నారంటే రావడం.. మళ్లీ కనిపించకుండాపోవడం కొందరికి పరిపాటిగా మారింది.

షరతులకు లోబడే ‘ప్రాక్టీస్‌’
ప్రభుత్వ వైద్యులు సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకునేందుకు 2006లో జీఓ 119 జారీ అయింది. ఇది కూడా షరతులకు లోబడి మాత్రమే నిర్వహించుకునే అవకాశం ఉంది. ఆయా వైద్యులు ‘కన్సల్టేషన్‌’ కోసం క్లినిక్‌ మాత్రమే నిర్వహించుకోవచ్చు. తాను పని చేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిలో మినహా, మరెక్కడైనా సొంతంగా ‘ప్రైవేట్‌ కన్సల్టింగ్‌ గది’ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రిలో తన అధికారిక పని వేళలు ముగిసిన తర్వాత సొంత కన్సల్టేషన్‌కు వెళ్లాలి. నర్సింగ్‌ హోంలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయకూడదు. కానీ కొందరు వైద్యులు చెలరేగిపోతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పని చేయడం పక్కన పెడితే.. ఏకంగా సొంత ఆస్పత్రులే ఏర్పాటు చేసుకుంటున్నారు.

తీరిక ఉంటేనే తరగతులు
ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజనాస్పత్రిలో వైద్య సేవల మాట దేవుడెరుగు.. విద్యార్థులకు తరగతులు కూడా తీరిక ఉంటేనే నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ఉంటున్న వారిలో కొందరి సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. తీరిక ఉంటే తరగతులకు వస్తున్నారు.. లేదంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు.   

సర్వజనాస్పత్రిలో ఆగని మరణాలు
అనంతపురం మెడికల్‌: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మృత్యు గంటలు మోగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 12 గంటల వ్యవధిలో తొమ్మిది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని ఏఎంసీ(ఆక్యూట్‌ మెడికల్‌ కేర్‌) వార్డులోనే ఈ మరణాలన్నీ జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైం ది.  బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తాడిపత్రికి చెందిన అశ్వర్థమ్మ(40) గుండె జబ్బుతో ఈనెల 27న సాయంత్రం 4.15 గంటలకు ఆస్పత్రిలో అడ్మిషన్‌ కాగా 5.30 గంటలకు మృతి చెందారు. గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన కుళ్లాయప్ప(40) పురుగుల మందు తాగి బుధవారం రాత్రి 7.50 గంటలకు ఏఎంసీలో అడ్మిట్‌ అయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఉదయం 4.30 గంటలకు మృతి చెందారు. కదిరి మండలం వీరాపల్లిపేటకు చెందిన ఉమాదేవి(35) సైతం పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చేరగా తెల్లవారుజామున 2 గంటలకు మరణించింది. ప్రస్తుతం ఏఎంసీలో మరో పది మంది వరకు అడ్మిషన్‌లో ఉన్నారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement