AP Disha Act 2019 Main Key Points | ఏపీ దిశ చట్టాల్లోని ముఖ్యాంశాలు - Sakshi Telugu
Sakshi News home page

వారికి ఇక మూడినట్టే; ‘దిశ’ యాక్ట్‌లోని ముఖ్యాంశాలు

Published Fri, Dec 13 2019 3:53 PM | Last Updated on Fri, Dec 13 2019 4:46 PM

Andhra Pradesh Disha Act Key Points - Sakshi

సాక్షి, అమరావతి : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు కీలక ముందడుగు వేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగెనెస్ట్‌ వుమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు.
(చదవండి : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: ఎఫ్‌ఐఆర్‌ కాపీలో..)

ఏపీ దిశ చట్టం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చట్టాల్లోని ముఖ్యాంశాలు :
1. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం నిర్భయ కేసుల్లో జైలు లేదా మరణదండన శిక్షగా విధిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం ద్వారా రేప్‌ చేసినవారికి తప్పనిసరిగా మరణదండన.

2. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తికావాలి. దీనిని ఏపీ దిశ చట్టంలో 4 నెలల నుంచి 21 రోజులకు కుదించారు. అత్యాచార నేరాల్లో విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయప్రక్రియ పూర్తై 21 రోజుల్లోపే నిందితుడికి శిక్ష పడాలి. 

3. అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవుతుంది. 

4. అత్యాచార నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు... దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ చేశారు.

5. సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. ఈ చట్టం ద్వారా– మెయిల్స్‌ద్వారా గాని, సోషల్‌ మీడియాద్వారా గాని, డిజిటల్‌ విధానంలోగాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొదటి తప్పుకు రెండేళ్లు, ఆ తర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకు వచ్చారు. 

6. ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మహిళలపై, పిల్లలపై నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కొద్దిరాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. కాని, దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి తీసుకువచ్చారు. 

7. ఇక ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరు నెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 3 నెలలకు తగ్గించారు.

8. మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇప్పటివరకూ ఎటువంటి ఏర్పాట్లు లేవు. అయితే జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ఏపీ దిశ చట్టం ద్వారా వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు. 

9. మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరగాడు, ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాని, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.
(చదవండి : దిశ బిల్లుకు ఆమోద ముద్ర)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement