బడికాయలపల్లె చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డుపై ఉన్న మారెళ్లవారిపాలెం గ్రామస్తులు
డోన్/బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా) త్రిపురాంతకం/ హిందూపురం సెంట్రల్: కోవిడ్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయంతో ఆయా రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల, జిల్లాల సరిహద్దుల్లో నిలిచిపోయిన రాష్ట్ర ప్రజలకు, వలస కూలీలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు అధికారులు, వలంటీర్ల ద్వారా భోజనం, వసతి, తాగునీరు, ఇతర సౌకర్యాలు అందిస్తోంది. పనులు లేకపోవడంతో ఇతర జిల్లాలకు వచ్చినవారు, వేరే రాష్ట్రాలకు వెళ్లినవారు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రాజస్థాన్‌లో చిక్కుకుపోయిన కర్నూలు కుటుంబం
కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన మస్తాన్‌వలి, మదార్, అక్బర్ కుటుంబ సభ్యులు అజ్మీర్‌లో చిక్కుకుపోయారు. వీరు 20 మంది కుటుంబ సభ్యులతో ఈ నెల 18న డోన్ నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్లారు. లాక్‌డౌన్‌తో తిరిగొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడే రోజుకు రూ.800 చెల్లిస్తూ ఒక లాడ్జిలో ఉంటున్నారు. డబ్బు కూడా తగినంత లేకపోవడంతో చిన్నపిల్లలతో కలిసి పస్తులు ఉండాల్సి వస్తోందని బాధితుడు మదార్ ఫోన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డోన్ తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి విన్నవించగా ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.
కర్ణాటక– ఆంధ్రా సరిహద్దులో గుంటూరు జిల్లావాసులు
కర్ణాటక–ఆంధ్రా సరిహద్దులో చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో గుంటూరు జిల్లా నూజెండ్లకు చెందిన 45 మందిని పోలీసులు అడ్డుకున్నారు. బెంగళూరులో ఏడాదిగా కూలి పనులు చేస్తున్న వీరు పనులు లేకపోవడంతో శనివారం మండలంలోని బడికాయలపల్లె చెక్‌పోస్టు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. వీరికి మానవ హక్కుల సంక్షేమ సంఘం స్థానిక నాయకుడు శంకర్ భోజన ఏర్పాట్లు చేసిన అనంతరం అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు అక్కడకి చేరుకుని నచ్చచెప్పి వారిని తిరిగి వెనక్కి పంపేశారు.
వెనుదిరిగిన వలస కూలీలు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, దాచేపల్లి, తాడికొండ, పేరేచర్ల, అమరావతి, రాజుపాలెం, ప్రత్తిపాడు, పెదకూరపాడు, క్రోసూరు ప్రాంతాల నుంచి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు లారీల్లో బయలుదేరిన 3,569 మందికిపైగా కూలీలను శనివారం ప్రకాశం జిలా త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వీరు ప్రయాణిస్తున్న 92 లారీలను నిలిపేసి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రలీల, ఆర్డీవో శేషిరెడ్డి, తహసీల్దార్ జయపాల్, డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని కూలీలను వెనక్కు పంపారు. కూలీలకు అధికారుల ఆదేశాల మేరకు స్థానిక వలంటీర్లు భోజన ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment