డిజైన్లలో రాజీ పడను..
ఫోస్టర్‌కు సినీ దర్శకుడు రాజమౌళితో సూచనలిప్పించాలని సీఎం ఆదేశం
సాక్షి, అమరావతి : రాజధాని డిజైన్లపై సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళితో వెంటనే సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఆలస్యమైనా పరవాలేదని, డిజైన్లలో రాజీ పడనని చెప్పారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన రాజధాని డిజైన్లను గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో మళ్లీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ డిజైన్లు అంతగా ఆకట్టుకోవడం లేదని, వెంటనే సినీ దర్శకుడు రాజమౌళితో మాట్లాడాలని అధికారులకు చెప్పారు. అవసరమైతే ఆయన బృందం మొత్తాన్ని లండన్ పంపించి డిజైన్ల రూపకల్పనలో ఫోస్టర్ సంస్థకు తగు సలహాలు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, తాను కూడా రాజమౌళితో మాట్లాడతానని చెప్పారు. అక్టోబరు 25న తాను కూడా లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ వారు రూపొందించిన ఆకృతులను పరిశీలిస్తానన్నారు. వచ్చే నెలలో అమెరికా, యూఏఈ పర్యటనతోపాటు లండన్ వెళతానని చెప్పారు. పరిపాలనా నగరంలోని ముఖ్య భవనాల డిజైన్లు, నిర్మాణ వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఇంకా సమయం తీసుకోవాలని నార్మన్ ఫోస్టర్ బృందానికి సూచించారు. నార్మన్ ఫోస్టర్ సమర్పించే డిజైన్లను అక్టోబర్ నెలాఖరులోగా ఖరారు చేద్దామని చెప్పారు.
ఆయన క్రియేటివ్ డైరెక్టర్ కాబట్టే..
ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 30న అసెంబ్లీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్ కాబట్టి ఆయన సలహా అడుగుతున్నామన్నారు.
రాజధానిలో లోకేష్ రహస్య పర్యటన
నిడమర్రు (తాడేపల్లి రూరల్): ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో విదేశీ బృందంతో కలసి రహస్యంగా పర్యటించారు. స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఇవ్వకుండానే నిడమర్రు నుంచి తాడికొండ వెళ్లే ప్రాంతంలో ఆయన పర్యటించారు.