సీపీఆర్ విధానాన్ని అనుసరిస్తున్న వైనం
గుండెపోటు..విద్యుత్ షాక్..నీటిలో మునక..ప్రమాదాలు సంభవించినప్పుడు సడన్‌గా గుండె ఆగిపోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో అప్రమత్తమై ఛాతీపై ప్రెస్ చేయడం (కార్డియో పల్మనరీ రీససిటేషన్) చేయడం ద్వారా తిరిగి గుండె కొట్టుకునేలా చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అమెరికా లాంటి బేసిక్ లైఫ్ సపోర్టు మెదడ్స్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రజల్లో సైతం అవగాహన ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మనదేశంలో ఈ విధానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని క్రిటికల్ కేర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రత్యేక కథనం ఇలా..
సాక్షి,ఒంగోలు: ‘‘నెల రోజుల కిందట గుంటూరుకు చెందిన వ్యాపారి బీసెంటు రోడ్డులో సడన్‌గా పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు అర్ధగంట జాప్యం జరిగింది. దీంతో అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సడన్ కార్డియాక్ డెత్‌గా వైద్యులు పేర్కొన్నారు.’’
‘‘ఎంజీ రోడ్డులోని ఓ జ్యూయలరీ షాపులో ఉద్యోగి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. స్పృహకోల్పోయిన అతన్ని పక్కనే ఉన్న ఆస్పత్రికి నిమిషాల వ్యవధిలో తరలించారు. దీంతో అతనికి అడ్వాన్స్‌డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టుతో ప్రాణాలు కాపాడగలిగారు. రెండు సంఘటనలో గుండె ఆగిపోగా, సకాలంలో స్పందించడంతో ఉద్యోగి ప్రాణాలు కాపాడగలిగినట్లు నిపుణులు చెబుతున్నారు.’’
మనం చూస్తూ ఉండగానే కొందరు కుప్పకూలిపోవడం..స్పృహలో లేకుండా పోవడం, తట్టినా లేవక పోవడం, గుండె కొట్టుకోకుండా ఆగిపోవడాన్ని సడన్ కార్డియాక్ డెత్‌గా పేర్కొంటాం. గుండెపోటుకు గురైనప్పుడు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో, రక్తంలో సోడియం, పొటాషియం అధికంగా ఉన్న వారిలో ఇలా సడన్‌గా కార్డియాక్ డెత్‌కు గురవడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ షాక్, పాయిజన్ తీసుకున్న వారు, నీటిలో మునిగిన వారు ఇలా సడన్ కార్డియాక్ డెత్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారిలో గుండె రక్తాన్ని పంపింగ్ చేయడం నిలిచిపోవడంతో శరీరంలో రక్తప్రసరణ నిలిచిపోయి. బ్రెయిన్‌కు రక్తం అందక బ్రెయిడ్ డెడ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే సడన్ కార్డియాక్ డెత్ అయిన 8 నిమిషాల్లో సీపీఆర్ చేయడం ద్వారా గుండెను తిరిగి కొట్టుకునేలా చేయవచ్చునని, ఈ పద్ధతితో సడన్ కార్డియాక్ డెత్‌లను 50 శాతం వరకూ నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజలు దీనిపై అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) అంటే ఏమిటీ :సడన్‌గా కుప్పకూలిన వ్యక్తి సడన్ కార్డియాక్ డెత్ అయినట్లు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు సీపీఆర్ పద్ధతిని అనుసరించాలి. కుప్పకూలిన వ్యక్తిని చదునుగా ఉన్న ప్రాంతానికి తీసుకు వచ్చి వెల్లకిలా పడుకోబెట్టాలి. పల్స్ లేక పోతే వెంటనే రెండు చేతులతో ఛాతి మధ్య భాగంలో ప్రెస్ చేయాలి. నిమిషానికి వందసార్లు ప్రెస్ చేయడం ద్వారా గుండె చేసే రక్తం పంపింగ్‌కు మన కృత్రిమంగా చేసినట్లవుతుంది. దీంతో మెదడుకు రక్తప్రసరణ పరఫెక్ట్‌గా జరగడంతో బ్రెయిన్ డెత్‌ను నిరోధించగలగడంతో పాటు, గుండె తిరిగి కొట్టుకునేలా చేయవచ్చు. ఇలా చేస్తూనే నోటి ద్వారా కృత్రిమంగా శ్వాస అందించడం వలన రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా మెయిన్ టెయిన్ అవుతంది. ఈ పక్రియను మనిషి పడిపోయిన ఎనిమిది నిమిషాల్లోపు చేసినట్లయితే సడన్ కార్డియాక్ డెత్‌లలో 50 శాతం నివారించవచ్చు.
షాక్ గురైతే ఇలా చేయండి : ఎలక్ట్రికల్ షాక్‌కు గురైనప్పుడు గుండె షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు గుండె వేగం నిమిషానికి 400 నుంచి 500 సార్లు కొట్టుకోవడంతో శరీరంలో రక్తప్రసరణ నిలిచిపోతుంది. ఆ సమయంలో సీపీఆర్ మెదడ్‌ను అనుసరిస్తూనే వీలయినంత త్వరగా ఆస్పత్రికి చేర్చాలి. అక్కడ రోగికి పరీక్షించి డీసీ విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె సాధారణ స్థితికి తీసుకు రావడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ షాక్‌కు గురైనప్పుడు సరైన అవగాహన లేక పోవడం వలన ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటున్నారు. అదే విధంగా నీట మునిగిన వారిని ఒడ్డుకు చేర్చిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ అయితే సీపీఆర్‌ను అనుసరించాలని చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో సైతం ఒక్కో సమయంలో గుండె ఆగిపోవడం జరుగుతుందని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తున్నారు.
విదేశాల్లో అయితే : అమెరికా లాంటి దేశాల్లో బేసిక్ లైఫ్ సపోర్టు, సీపీఆర్ విధానాలపై పోలీసు, ఫైర్ శాఖల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా అంబులెన్స్‌లో అడ్వాన్స్‌డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు (ఏసీఎల్‌ఎస్)లో శిక్షణ పొందిన సిబ్బంది, పరికరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంటున్నారు. దీంతో ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చికిత్స ప్రారంభించడం జరుగుతుందని చెబుతున్నారు. మనకు కూడా ఆ తరహా అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తే అలాంటి ఘటనలో ప్రాణాలు కోల్పోతున్న వారిలో 50 శాతం మందిని కాపాడవచ్చునని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment