గళం విప్పరేం..! | Bickering selected educational institutions | Sakshi
Sakshi News home page

గళం విప్పరేం..!

Published Mon, Jun 23 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

Bickering selected educational institutions

  •      ఉత్తరాంధ్రలో అప్రాధాన్య విద్యా సంస్థలు
  •      వందల్లో సీట్లు, అరకొర ఉపాధి అవకాశాలు
  •      విద్యాశాఖ మంత్రి ఉన్నా ప్రయోజనం సున్న
  • ఏయూక్యాంపస్ : దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం మరో పర్యాయం తేటతెల్లమవుతోంది. ఉత్తరాంధ్రకు కేంద్ర విద్యాసంస్థల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అప్రాధాన్యమైన వాటిని ఉత్తరాంధ్రకు కేటాయిస్తున్నారు. ఎక్కువ మందికి అవకాశాలు, ఉపాధిని అందించే ప్రధానమైన విద్యాసంస్థలను రాయలసీమకు తరలించుకుపోవడానికి నేతలు సిద్ధమయ్యారు.

    ఉత్తరాంధ్రకు చెందిన రాజకీయ నేతలు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తుండంతో వారి పని ఇంకా సులభమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఫలానా విద్యా సంస్థలు కావాలని ఏ ఒక్క అధినేత నోరు విప్పి అడగటం లేదు. విద్యాశాఖ మంత్రి ఈ ప్రాంతం వ్యక్తి అయినప్పటికీ ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యా యం జరుగుతోంది. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతం లో పలు కేంద్రీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో ప్రస్తు తం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉత్తరాం ధ్రలో ఒక ఐఐఎం, పెట్రో వర్సిటీ, గిరిజన వర్సి టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎయిమ్స్, నిట్, వ్యవసాయ వర్సిటీ వంటివి కృష్ణా-గుంటూరు జిల్లాలకు తరలించుకు పోతున్నారు. తిరుపతి ప్రాంతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐటీలను ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయనే వాదనలు బలప డుతున్నాయి. ప్పటికే రాజధాని విశాఖలో ఏర్పాటుచేయరని స్పష్టమైన సంకేతాలను నేతలు పంపుతున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన విధంగానే రాజధాని చుట్టూనే ప్రధాన విద్యాకేంద్రాలను ఏర్పాటుచేయడానికి సిద్ధమవుతున్నారు.
     
    అభివృద్ధికి తోడ్పడేనా...
     
    ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పాటుచేయనున్న కేంద్రీయ విద్యాసంస్థల పరిధి పరిమితంగా ఉంటుంది. వీటిలో ఒక్కో సంస్థలో రెండు నుంచి నాలుగు కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య సైతం రెండు నుంచి నాలుగు వందల మధ్య ఉంటుంది. వీటిలో పనిచేసే బోధనా సిబ్బంది సంఖ్య వంద నుంచి మూడు వందలలోపు, బోధనేతర సిబ్బంది వంద వరకు ఉంటారు.

    ఐఐఎంలో వంద నుంచి రెండు వందల మంది విద్యార్థులు ఉండే అవకాశం ఉంటుంది. పెట్రో వర్సిటీలో రెండు యూజీ, మరో రెండు పీజీ కోర్సులను నిర్వహించే అవకాశం ఉంటుంది. వీటిలో గరిష్టంలో 120 నుంచి 240 వరకు ప్రవేశాలు కల్పిస్తారు. గిరిజన వర్సిటీలో కేవలం కొన్ని ప్రత్యేక కోర్సులను నిర్వహించి, పరిమితంగా ఉంటుంది.

    కేంద్రీయ హోదా ఉన్నప్పటికీ చిన్నపాటి విద్యా సంస్థలను ఉత్తరాంధ్రకు కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలను ఈ సంస్థలకు కేటాయించినా ఈ ప్రాంతానికి జరిగే లబ్ధిమాత్రం స్వల్పంగానే ఉంటుంది. కేవలం కొద్ది మందికి ఉపాధి కల్పించి, పరిమితంగా పనిచేసే ఈ సంస్థలు ఎంతవరకు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
     
    ఎయిమ్స్, ఐఐటీల మాటేమిటి..

     
    విద్య, వైద్య రంగాలకు విశాఖ కేంద్రంగా నిలుస్తుందని నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలుగా మారిపోతున్నాయి. జాతీయ స్థాయిలో వైద్య విద్యాసంస్థగా నిలిచే ఎయిమ్స్ తరహా వైద్య విద్యాసంస్థ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలను విశాఖలో ఎందుకు కేటాయించడం లేదనేది ప్రశ్నగా మారింది.

    అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే వ్యవస్థ అన్ని వసతులు ఉన్న కాస్మోపాలిటన్ సిటీగా పేరుగాంచిన విశాఖ ఈ విద్యా సంస్థల స్థాపనకు అన్ని విధాలా అనుకూలం అన్నది నిర్విదాంశం. ఈ దిశగా స్థానిక నేతలు కనీసం నోరుమెదపక పోవడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. కనీసం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్నయినా కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్పుచేసే దిశగా పనిచేయాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement