కలెక్టర్ చెవిలో పట్టు పూలు | Broke a senior official of massive corruption | Sakshi
Sakshi News home page

కలెక్టర్ చెవిలో పట్టు పూలు

Published Fri, Jun 24 2016 2:30 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Broke a senior official of massive corruption

సెరికల్చర్ శాఖలో బది‘లీల’లు
భారీ అవినీతికి తెరలేపిన ఓ ఉన్నతాధికారి

 

చిత్తూరు: జిల్లా సెరికల్చర్ శాఖలోని ఓ ఉన్నతాధికారి కలెక్టర్ సిద్ధార్థజైన్ చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖ ఉద్యోగుల బదిలీల్లో భారీ అవినీతికి పాల్పడినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని అత్యంత విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో శాఖలో 20 శాతానికి మించి బదిలీలు జరపకూడదు. అయితే ఆ శాఖలో మాత్రం ఏకంగా 40 శాతం మందిని బదిలీ చేసినట్లు తెలియవచ్చింది. ఈ మేరకు వీరికి కొన్ని రోజుల క్రితం జరిగిన కౌన్సెలింగ్‌లో ఉత్తర్వులు కూడా జారీచేశారు. ఈ బదిలీలపై  గురువారం ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు పలమనేరు సెరికల్చర్ ఏడీ కార్యాలయంలో సమావేశం కూడా ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి హాజరైన ఉద్యోగులకు బదిలీ ప్రక్రియను వివరిస్తూ... కలెక్టర్ ప్రత్యేక అనుమతితో కొంత ఎక్కువ శాతం బదిలీలు చేశామని.. దీనిపై ఎవరికీ అనుమానం వద్దని వారికి ధైర్యం చెప్పారు. మొత్తం 65 మందిని బదిలీ చేశామని, వారికి కేటాయించిన ప్రాంతాల వారీగా ఆయా ఏడీవోలకు రిపోర్ట్ చేస్తారని, బదిలీపై  వచ్చిన  వారిని చేర్చుకొని వర్క్ అలాట్‌మెంట్ మాత్రం ముందు పని చేసిన ప్రాంతాల్లోనే ఇవ్వాలని సూచించారు. ఇది ప్రమాదకరమని కొంతమంది ఏడీవోలు అనుమానం వ్యక్తం చేయగా... ‘కలెక్టర్‌కు తెలిస్తే కదా’ అని జిల్లా సెరికల్చర్ అధికారి వారికి బదులిచ్చారు.


ఉదాహరణకు..  ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్  మదనపల్లె సెరికల్చర్ ఆఫీసులో పని చేస్తోంది. ఈమెను తిరుపతికి బదిలీ చేశారు. ఆమె తిరుపతి సెరికల్చర్ ఏడీ ఆఫీసులో రిపోర్టు చేస్తుంది. తిరుపతి ఏడీ మాత్రం ఆమెకు మదనపల్లెలోనే వర్క్‌అలాట్‌మెంట్ చేస్తారు. ఓటెక్నికల్ ఆఫీసర్ కొలమాసపల్లెలో పని చేస్తున్నారు. ఆయన్ను మదనపల్లెకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మదనపల్లె ఏడీ ఆఫీసులో జాయిన్ అవుతారు. మదనపల్లె ఏడీ ఆ టెక్నికల్ ఆఫీసర్‌కు కొలమాసపల్లిలోనే వర్క్ అలాట్‌మెంట్ చేస్తారు.  ఇదీ పట్టు పరిశ్రమ శాఖలో నెలగా జరుగుతున్న బది‘లీల’ల భాగోతం. ఈ తతంగంతో ఆ ఉన్నతాధికారి ఏకంగా జిల్లా కలెక్టర్ చెవిలో పట్టుపూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement