సాక్షి, విజయవాడ :
సీమాంధ్ర జిల్లాలో వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా ఉండి ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిమీద కునుకే లేకుండా పోయింది. ఉపఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజ యఢంకా మోగించడంతోపాటు తదనంతర పరిణామాల్లోనూ ఆ పార్టీదే పైచేయి కావడం బాబును కలవరపెడుతోంది. తెలుగుజాతి ఆత్మగౌరవయాత్ర పేరుతో చేస్తున్న బస్సుయాత్ర తుస్సుమనడంతో ఎక్కువసేపు జగన్ గురించే మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను, సీమాంధ్రలో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని ధ్వజమెత్తారు. పట్టుమని పదిమంది మనుషులు కనపడితేచాలు బస్సు ఆపి కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు కుమ్ముక్కయ్యాయని ఊదరగొడుతున్నారు.
ఆ ప్రసంగాన్ని వింటున్న జనం చంద్రబాబు ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. సమైక్యాంధ్రపై స్పష్టత ఇవ్వకుండా ఆయన చేస్తున్న ప్రసంగాలకు ప్రజలు చికాకు పడుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వస్తుందేమోనన్న భయం చంద్రబాబును పట్టిపీడిస్తోంది. జగన్ కాంగ్రెస్‌తో కుమ్మక్కై బెయిల్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. జగన్ బెయిల్ కోసం కాంగ్రెస్‌తో రాజీ పడినట్లయితే ఏడాదికి పైగా జైలులో ఎందుకుంటారని జనం బాబు మాటల్ని కొట్టిపారేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఆగ్రహం
చంద్రబాబు కొన్ని సందర్భాల్లో సహనాన్ని కోల్పోయి అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు. కంబంపాడులో ఆయన ప్రసంగిస్తున్నప్పడు, అక్కడ ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు జై జగన్,జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెగింది. ‘మీ తోకలు కత్తిరిస్తా.. పులివెందులకు వస్తా... నాకు రౌడీయిజం అంటే భయం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు కూడా ఎదురుతిరిగి నిరసన తెలిపేందుకు ముందుకురాగా పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తుల్ని శాంతింపచేశారు. గంపలగూడెం మండలం పెదకొమెర (తోటమూల)లో జరిగిన సభలో బాబు మాట్లాడుతూ ‘వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దొంగలని, మీ జేబులు జాగ్రత్తగా చూసుకోండి’ అని అనగానే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో దొంగలు లేరని, అందరూ నిజాయితీగా ఉంటారంటూ కొంతమంది అసహనం ప్రదర్శించారు.
జూనియర్ అభిమానుల మండిపాటు
చంద్రబాబు సోమవారం రెడ్డిగూడెం మండలం మిట్టగూడెం సెంటర్‌లో జరిగిన సభలో మాట్లాడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేయకపోవడంతో జూనియర్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, ఆయన మనమడు జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కనపెడుతున్నారంటూ బహిరంగంగానే నిరసన తెలియచేశారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.
తుస్సుమన్న బస్సుయాత్ర
Published Wed, Sep 11 2013 5:35 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM
Advertisement