సాక్షి, నిజామాబాద్: సంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక యంత్రాలతో పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సర్కారు నీరుగార్చుతోంది. ఈ పథకానికి ఇచ్చే కేటాయింపులలో కేంద్ర సర్కారు ఈ ఏడాది కోత పెట్టింది. గత ఏడాది మంజూరు చేసిన నిధులలో సుమారు 60 శాతానికి తగ్గించింది. దీంతో ఆధునిక పద్ధతులలో సాగు చేయాలనుకునే రైతులకు ప్రోత్సాహం కరువవుతోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద కేంద్రం వ్యవసాయ యాత్రీకరణకు నిధులు కేటాయిస్తుంది. యంత్ర పరికరాలు కొనుగోలు చేసిన రైతులకు ఈ నిధుల నుంచి సబ్సిడీని అందిస్తారు.
ఇందుకోసం ఈ ఏడాది రాష్ట్రానికి రూ. 73.99 కోట్లను కేటాయించి, 33,627 యూనిట్లను మంజూరు చేశారు. ఈ పథకానికి ఆర్‌కేవీవై నిధులతో పాటు స్టేట్ నార్మల్ ప్లాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులిస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.10.01 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వాటిని రూ.3.25 కోట్లకు తగ్గించారు. అసలే ఆలస్యంగా నిధులను విడుదల చేసిన కేంద్ర సర్కారు ఆపై అరకొర కేటాయింపులతో చేతులు దులుపుకుందనే విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి.
50 శాతం రాయితీ
యంత్ర పరికరాలు కొనుగోలు చేసిన రైతులకు 50 శాతం మేరకు రాయితీ ఇస్తారు. ఈ పథకం కింద ఎక్కువగా రొటోవేటర్లు, తైవాన్‌స్ప్రేలు, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రి ల్స్, టార్ఫాలిన్‌లు, వరినాటే యంత్రాలు, గడ్డికోత మిషన్లు, పవర్ టిల్లర్లు, పసుపు ఉడికించే యంత్రాలు, ట్రాక్టర్, ఎద్దులతో నడిచే యంత్ర పరికరాలు రైతులకు అం దజేస్తారు. చిన్న పరికరాలను కొనుగోలు చేసిన రైతులకు వ్యక్తిగతంగా, వరినాటు యంత్రాలు వంటి భారీ యంత్రాలకు గ్రూపు (కొందరు రైతులకు కలిసి)గా సబ్సిడీ ఇస్తున్నారు. ఒక్క రొటోవేటర్‌లకు మాత్రం సబ్సిడీ రూ. 50 వేలకు మించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతులకు నిరాశ
ఆశించిన మేరకు నిధులు విడుదల కాకపోవడంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు.దీంతో వేలాది మంది రైతుల ఆ శలపై నీళ్లు చల్లినట్లయింది. ఖరీఫ్ ఆరంభానికి ముందే జరిగిన రైతు చైతన్య యాత్రల్లో జిల్లాలో వేలాది మంది రైతులు యంత్ర పరికరాల కోసం దరఖాస్తులు చేసుకు న్నారు. ఆ తర్వాత కూడా ధరఖాస్తులు వచ్చాయి. కేంద్రం జూన్‌లోనే ఆర్‌కేవీవై నిధులు విడుదల చేయాల్సి ఉండగా, అక్టోబర్ రెండో వారంలో విడుదల చేసింది. దీంతో మండల వ్యవసాయాధికారులు ఈ నెల మొదటి వారం నుంచి యంత్ర పరికరాలను మంజూరు చేస్తున్నారు. కొందరికే యంత్ర పరికరాలు మంజూరవడంతో వేలాది మంది రైతుల దరఖాస్తులు వ్యవసాయశాఖ వద్ద మూలుగుతున్నాయి. ఈ సారి తైవాన్ స్ప్రేలు సరఫరా చేసే ఏజెన్సీతో ఒప్పందం చేసుకోకపోవడంతో వీటి సరఫరాను వ్యవసాయశాఖ నిలిపివేసింది.
యాంత్రీకరణకు సర్కారు కోత
Published Mon, Nov 25 2013 6:41 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement