సాక్షి, అమరావతి: చంద్రబాబు నిర్వాకంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల 1న అందాల్సిన వేతనాలకు బ్రేక్ పడింది. గత నెల 17న ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించగా.. మండలిలో టీడీపీ సభ్యులు బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకున్నారు. బిల్లుకు ఆమోదం తెలపకుండానే డిప్యూటీ చైర్మన్ మండలిని నిరవధిక వాయిదా వేయడంతో ఈ నెల 1 నుంచి ఖజానా నుంచి పైసా వాడేందుకు వీల్లేకుండా పోయింది. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లకు 1న వేతనాలందలేదు. మండలి ఆమోదించకపోయినా..మండలిలో ప్రవేశపెట్టిన 14 రోజుల తర్వాత గవర్నర్ ఆమోదానికి ద్రవ్య వినిమయ బిల్లును పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు బుధవారం అర్ధరాత్రితో 14 రోజులు పూర్తవుతుండటంతో బిల్లును గురువారం గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. బిల్లు ఆమోదానికి గవర్నర్ ఎంత సమయం తీసుకుంటారనే అంశంపై ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఆధారపడి ఉంటుంది. గవర్నర్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఖజానా నుంచి డబ్బులు డ్రా చేసే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. బిల్లుకు ఆమోదానికి గవర్నర్ 2–3 రోజుల సమయం తీసుకుంటే.. ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యమవుతాయి.
తెలుగుదేశం వైఖరి వల్లే..
సాధారణంగా బడ్జెట్‌కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడం శాసనసభతోపాటు శాసన మండలి ప్రాథమిక విధి. లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేని పరిస్థితేర్పడింది. ఈ కారణంగా అప్పట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు(ఏప్రిల్–జూన్) ఖజానా నుంచి నిధుల వ్యయానికి గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. జూలై ఒకటి నుంచి ఖజానా నుంచి పైసా ఖర్చు చేయాలంటే ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ, మండలి ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసమే గత నెల 17న అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించగా.. దాన్ని మండలి ఆమోదానికి ప్రభుత్వం పంపింది. రాజధాని రాజకీయం పేరిట టీడీపీ ఎమ్మెల్సీలు రెచ్చిపోయి వ్యవహరించడంతో బిల్లు ఆమోదం పొందకుండానే మండలిని వాయిదా వేశారు. ఈ కారణంగా జూలై ఒకటి నుంచి ఖజానా నుంచి నిధులు వాడేందుకు వీల్లేకుండా పోయింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒకటో తేదీన వేతనాలు పొందలేకపోయారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. జీతాలు రాక చిరుద్యోగుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు, తెలుగుదేశం ఎమ్మెల్సీల నిర్వాకం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
బాబు నిర్వాకంతో ఉద్యోగులకు జీతాలు ఆలస్యం
Published Thu, Jul 2 2020 4:08 AM | Last Updated on Thu, Jul 2 2020 4:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment