గుర్తింపులేని పాఠశాలల్లో పిల్లల్ని చేర్చొద్దు | children should not be join in unknown schools | Sakshi
Sakshi News home page

గుర్తింపులేని పాఠశాలల్లో పిల్లల్ని చేర్చొద్దు

Published Fri, Jun 13 2014 12:50 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

గుర్తింపులేని పాఠశాలల్లో పిల్లల్ని చేర్చొద్దు - Sakshi

గుర్తింపులేని పాఠశాలల్లో పిల్లల్ని చేర్చొద్దు

గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించకుండా తల్లిదండ్రులను చైతన్యపరిచే బాధ్యత విద్యాశాఖాధికారులపైనే ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ సురేశ్‌కుమార్ గురువారం ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలకు సంబంధించిన అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు సూచించారు. మండలాల వారీగా గురిం్తపు లేని పాఠశాలల జాబితాను విద్యాశాఖ కార్యాలయాల్లో బహిరంగ పర్చాలని ఎంఈవోలను ఆదేశించారు.
 
 ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామని, ఏ విద్యార్థికైనా పుస్తకాలు అందకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.  పాఠశాలలు తెరిచిన రోజు నుంచే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పనిసరిగా అమలుపర్చాలని, ఇందుకు జిల్లాకు రూ.ఆరు కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఈ నిధులతో ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా బియ్యం కోటాను పాఠశాలలకు పంపి, మరుసటి నెల కోటాకు ముందుగానే సమీక్షించుకోవాలని పౌర సరఫరాల సంస్థ అధికారులను కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో వంటశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు.  జిల్లాకు మంజూరైన 14 మోడల్ స్కూళ్లలో 13 నిర్మాణం పూర్తి చేసుకుని, వాటిలో తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు.  ఈపూరులో స్థల సేకరణ సమస్యతో నిలిచిన మోడల్ స్కూల్ నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
 
 ఎంఈవోలకు మెమోలు..
 పొన్నూరు, చేబ్రోలు, నిజాంపట్నం, నగరం మండలాల్లో విద్యార్థులకు గత విద్యాసంవత్సరం యూనిఫాం ఇప్పటి వరకూ పంపిణీ చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మండలాల ఎంఈవోలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. 2014-15 విద్యాసంవత్సరానికి 2,66,340 మంది విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో డ్రాపౌట్లుగా గుర్తించిన 2,221 మందిని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
 
 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. వసతుల కల్పన వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు జేసీ కె. నాగేశ్వరరావు, పాఠశాల విద్య ఆర్జేడీ పి. పార్వతి, డీఈవో డి. ఆంజనేయులు, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ టి. శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో సుబ్బారావు, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement