'వారిద్దరూ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు'
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరూ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పుతో గెలిచిన సీఎంలు నామినేటెడ్ గవర్నర్ వద్దకు వెళ్లడం సరికాదన్నారు. సాగర్ జలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ముందే మాట్లాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటు అని మైసూరా విమర్శించారు. దీనికి ఇరురాష్ట్రాల పాలకులు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అనే ఆందోళన నెలకొందని మైసూరా అన్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు మానుకుని చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు.