సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని.. ఈ వ్యవస్థలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు వివిధ పథకాలు, వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవి ఆశించిన స్థాయిలో ఫలితాలు అందాలంటే గ్రామసచివాలయాలు సమర్థవంతంగా పనిచేయాలి. సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తేనే ప్రభుత్వం కలలు నిజమవుతాయని పేర్కొన్నారు.
స్పందించకపోతే వారిది అరణ్యరోధనే అవుతుంది
ప్రభుత్వంలోని పలు కీలక శాఖలకు చెందిన ప్రతి వ్యక్తి గ్రామ సచివాలయంలో ఉద్యోగులుగా ఉన్నారు. వీరంతా గ్రామ సచివాలయాల్లో కూర్చోవాలి. రైతు భరోసా కేంద్రాలు వచ్చేంతవరకూ ఆయా విభాగాలకు చెందిన సచివాలయ ఉద్యోగులు కూడా గ్రామసచివాలయాల్లో ఉండాలి. గ్రామ సచివాలయం నుంచి సంబంధిత పోర్టల్‌లో రిక్వెస్ట్‌రాగానే వెంటనే స్పందించాలి. ఉదాహరణకు పెన్షన్‌కు సంబంధించిన రిక్వెస్ట్ వచ్చిందనుకుంటే దానిపై సంబంధిత కార్యదర్శి సమీక్ష, పర్యవేక్షణ చేసేలా ఉండాలి. లేకపోతే దరఖాస్తుదారులది అరణ్య రోదనే అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందిస్తున్న 541 సేవలను నిర్దేశిత కాలంలోగా అందిస్తామని చెప్పాం. ఏ సేవలు ఎప్పటిలోగా అందుతాయో గ్రామ సచివాలయాల్లో బోర్డులు కూడా పెడుతున్నాం. దీన్ని మనం గౌరవించేలా ఉండాలి.
గ్రామ సచివాలయాలనుంచి వచ్చే విజ్ఞాపనలు, దరఖాస్తులకు ప్రతి శాఖకార్యదర్శి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి శాఖలోనూ, విభాగంలోనూ కూడా ఒక వ్యక్తిని వీటి పర్యవేక్షణకోసం పెట్టాలి. వచ్చే దరఖాస్తులు, విజ్ఞాపనలను పట్టించుకోలేదంటే.. ఆ శాఖలో సమస్య ఉన్నట్టే లెక్క. ప్రతి విభాగానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని విజ్ఞాపనలు గ్రామ సచివాలయం నుంచి వచ్చాయన్న సమాచారం నేరుగా నాకు కూడా వస్తుంది. సీఎం కార్యాలయం కూడా వాటిని చూస్తుంది. ఈ పర్యవేక్షణ అనేది శాఖల కార్యదర్శులు కూడా చేయాలి. ఎక్కడైనా ఆలస్యం జరిగితే, సమాజంలో అట్టడుగున ఉన్న పేదవాళ్లు, సామాన్యులు నష్టపోతారు. న్యాయం జరగాల్సిన సమయంలో జరగకపోతే అది కూడా తప్పే అవుతుంది. ప్రభుత్వ విభాగాలు సరిగ్గా స్పందించక ఆలస్యం జరిగితే, పేదవాడికి నష్టం జరుగుతుంది. అది మనం చేసిన తప్పే అవుతుంది.
ఎంపిక ఒక పద్ధతి ప్రకారం జరగాలి
రాబోయే రోజుల్లో మనం ప్రారంభించబోయే పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు, అనుసరిస్తున్న విధానాలు, లబ్ధిదారుల ఎంపిక అంతా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. పథకాన్ని అమలు చేయదలుచుకున్న శాఖ నేరుగా మార్గదర్శకాలు, అర్హతలు, అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని నేరుగా గ్రామ సచివాలయాలకు పంపించాల్సి ఉంటుంది:. దీనికి సంబంధించిన వివరాలతో పోస్టర్లను రూపొందించి గ్రామ సచివాలయాల్లో అతికిస్తారు. రేషన్‌కార్డులు, పెన్షన్లు తదితర లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగిందని మనం గర్వంగా చెప్పగలం. సర్వేల పేర్లు చెప్పి ప్రభుత్వ పథకాలు ఎగ్గొట్టకుండా వాలంటీర్ల సహాయంతో ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నాం:. అర్హులు ఎవ్వరికీ కూడా పథకాలు దక్కకుండా పోయే పరిస్థితి ఉండకూడదు. ఎవరైనా మిగిలిపోతే వారు ఎలా దరఖాస్తు చేయాలన్నదానిపై మనం వివరాలు సచివాలయాల్లో ఇస్తున్నాం.
గ్రామ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం
గ్రామ సచివాలయాల్లో ప్రతి రోజూ కూడా స్పందన కార్యక్రమం జరుగుతుంది. ప్రజలనుంచి దరఖాస్తులు, విజ్ఞాపనపత్రాలను ప్రతిరోజూ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆయా దరఖాస్తులు, విజ్ఞాపనలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించి మంజూరు చేస్తాం:. ఈ సమయంలోగా పనులు జరగకపోతే విశ్వసనీయత పోతుంది. ప్రజలకిచ్చే రశీదుల ఆధారంగా వారిచ్చిన దరఖాస్తు ఎంతవరకు వచ్చింది..? ఎప్పుడు పరిష్కారం అవుతుందన్న దానిపై వారికి ఫోన్‌కాల్స్ వెళ్లాలి. ప్రజలకందించాల్సిన ముఖ్యమైన సేవలకు సంబంధించి స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉండాలి. ఒక పథకం అమలుకు నెలరోజులు ముందుగా మార్గదర్శకాలు.. వాటిపై సచివాలయాల ఉద్యోగుల, వాలంటీర్లకు శిక్షణ పూర్తికావాలి. దీనివల్ల అర్హుల ఎంపిక సులభంగా, పారదర్శకంగా జరుగుతుంది. దీనివల్ల వారు మరింత సమర్థవంతంగా పనిచేస్తారు. మనం చాలా పారదర్శకంగా పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ఎవరైనా మిగిలిపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్తున్నాం. దరఖాస్తు చేసుకున్న ఎన్నిరోజుల్లోగా పరిష్కరిస్తామో చెప్తున్నాం.
అయినా సరే నిజాలు దాచి కొన్ని పత్రికలు, ఛానళ్లు నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయి. వాస్తవాలు, సరైన సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. పీరియాడికల్ ఇండికేటర్స్ ఉండాలి. ఆన్‌లైన్ అటెండెన్స్ చెకింగ్ ఉండాలి. వాలంటీర్లకూ అటెండెన్స్ విధానం తీసుకురావాలి. దీనివల్ల వాళ్లు నిరంతరం చురుగ్గా ఉంటారు. పథకాలు కూడా సక్రమంగా సకాలానికి లబ్దిదారులకు చేరుతాయి. యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నప్పుడు పథకాల అమల్లో ఆలస్యం జరగకూడదు. వ్యవస్థ కరెక్టుగా ఉంటే.. లోపాలు వెంటనే తెలుస్తాయి. మనం వెంటనే ఆ లోపాలను తొలగించగలుగుతాం. గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను మనం ఓన్ చేసుకోవాలి. 2వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉన్నప్పుడు మనం వేరే వ్యవస్థలపై ఆధారపడడంలో అర్థంలేదు. ప్రజల నుంచి విజ్ఞాపనల పరిష్కారంలో నాణ్యత ఉండాలి. ప్రభుత్వ పాలనను ప్రజల గడప వద్దకే చేర్చాలి. పథకాల అమలులో ఎలాంటి అవినీతి కనిపించకూడదు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఫిర్యాదు చేసే విధానం, వెంటనే చర్యలు తీసుకునే విధానాలు ఉండాలి. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ బలోపేతంగా ఉండాలని' సీఎం వైఎస్ జగన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన వివరాలు
►గ్రామ వాలంటీర్లు 1.94 లక్షలు, వార్డు వాలంటీర్లు 0.67 లక్షలు
►గ్రామ సచివాలయాలు 11160, వార్డు సచివాలయాలు 3842
►గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు 1,13,623
►వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 82.5 శాతం
►గ్రామ సచివాలయాలకు 100శాతం భవనాలు ఏర్పాటు, 99.7శాతం కరెంటు సౌకర్యం, 95.1 శాతం ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు
►వార్డు సచివాలయాలకు 100 శాతం భవనాలు ఏర్పాటు, 99.3 శాతం కరెంటు సౌకర్యం, 97 శాతం ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment