కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు
Published Tue, Aug 13 2013 5:49 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న కానిస్టేబుల్‌పై తక్షణమే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఏ.వి. రంగనాథ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్‌లో వివిధ సమస్యలపై ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో కొన్ని...
అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని అశ్వాపురానికి చెందిన భాగ్యలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్త అశ్వాపురంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని, అతనికి ఇదివరకే పెళ్లి జరిగిందని, ఈ విషయాన్ని దాచి మోసం చేశాడని చెప్పింది. ఇప్పడు మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్నం తేవాలని వేధిస్తున్నాడని పేర్కొంది. దీనికి స్పందించిన ఎస్పీ.. అతనిపై వరకట్నం కేసు నమోదు చేయాలని, కానిస్టేబుల్ నివేదిక అందించాలని, ఉద్యోగం నుంచి తొలగించేందుకు శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు.
తిరుమలాయపాలెంలో తన భర్త ప్లాట్‌ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని మరిది బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మహబూబాబాద్‌కు చెందిన రజిత ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్త కానిస్టేబుల్‌గా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఆ సమయంలో తన పిల్లలు చిన్నవారు కావడంతో ప్లాట్‌ను అత్త పేరుపై రిజిష్టర్ చేశామని తెలిపింది. ఇటీవల అత్త చనిపోవడంతో తన మరిది ప్లాట్‌ను ఆయన మామగారి పేరుతో రిజిష్టర్ చేయించుకున్నాడని, న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై కేసు నమోదు చేయాలని తిరుమలాయపాలెం ఎస్సైను ఆదేశించారు. కారేపల్లిలో చీటీల పేరుతో ఓ వ్యక్తి రూ. 9 లక్షల వరకు మోసం చేశాడని, అందుకు గానూ 2 ఎకరాల భూమిని ఇచ్చాడని, ఇటీవల భూమి సాగుచేసుకునేందుకు వెళ్లగా బెదిరిస్తున్నాడని భావ్‌సింగ్ ఫిర్యాదు చేశారు. వ్యాపారిపై వెంటనే చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని సీఐను ఆదేశించారు.
తన భర్త, అత్తమామలు, మరిది అదనపు కట్నం కోసం ఐదేళ్లుగా వేధిస్తున్నారని దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన సంధ్య ఫిర్యాదు చేసింది. వారిపై వరకట్నం కింద కేసునమోదు చేసి రిమాండ్ చేయాలని ఎస్పీ దమ్మపేట ఎస్సైను ఆదేశించారు. భూమి విక్రయ వ్యవహారంలో కుమారుడు బెదిరిస్తున్నాడని ఏన్కూర్ మండలం శ్రీరాంగిరికి చెందిన ఓ వృద్ధురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల తన భర్త వైద్య ఖర్చులకు రూ. 6 లక్షల వరకు అప్పు చేశామని, కుమారుడికి చెబితే తన కు సంబంధంలేదని చెబుతున్నాడని, చేసేదీలేక భూమి అమ్మకానికి పెడితే బెదిరిస్తున్నాడని తెలిపింది. దీనిపై కేసు నమెదు చేయాలని ఖమ్మం అర్బన్ సీఐను ఎస్పీ ఆదేశించారు.
Advertisement
Advertisement