'రాజ్యాంగానికి సమాధి కట్టాలని చూస్తున్న సీఎం'
Published Sun, Apr 17 2016 2:59 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
అనంతపురం అర్బన్ : రాజధాని పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగ నియామకాలు చేపట్టి, అమరావతిలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రాజ్యాంగానికి చంద్రబాబు సమాధి కట్టాలని చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం అనంతపురం విచ్చేసిన ఆయన స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీపీఎస్‌సీని కాదని సీఆర్‌డీఏకి పూర్తి అధికారాలు ఇచ్చి నియామకాలు చేపట్టాలనే ఆలోచనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు వ్యతిరేకమన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని, సీఆర్‌డీఏ పరిధిలో ఏపీపీఎస్‌సీ ద్వారా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే అమరావతిలోనే నిరసన తెలుపుతామన్నారు.
ప్రభుత్వ విద్యని సర్వ నాశనం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,100 ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసేందుకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యను ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధపడ్డారని ధ్వజమెత్తారు. వియ్యంకులుగా మారిన కార్పొరేట్లు నారాయణ, గంటా శ్రీనివాసరావు చేతుల్లో విద్యను పెట్టాలని అనుకుంటున్నారని ఆరోపించారు. విద్య, వైద్య రంగాన్ని సామాన్య ప్రజలకు అందకుండా చేయాలనే ఆలోచనను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ, విద్యార్థి, గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలతో ఈ నెలాఖరున విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
Advertisement