రబీకి సెలవు!
ఖరీఫ్‌కే అందని నీరు
తాగునీటికే కష్టమంటున్న అధికారులు
పులిచింతల జలాశయం ఖాళీ
ఆందోళనలో అన్నదాత
విజయవాడ : కృష్ణాడెల్టా గత వందేళ్లలో లేని నీటిఎద్దడిని ఈ ఏడాది ఎదుర్కొంటోందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ పంటలకు నీరివ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతులు బోర్లు, మోటార్లను ఆశ్రయించి సాగు చేశారు. వాస్తవానికి 13.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంట వేయాల్సి ఉండగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 లక్షల ఎకరాల్లోనే వేశారు. అందులోనూ కొంత భాగం నీరందక ఎండిపోవడంతో రైతులు ఆ పంటను దున్నేశారు. ఎలాగోలా ఖరీఫ్‌ను పూర్తిచేస్తున్న రైతన్నలు రబీపై దృష్టి సారిస్తున్నారు.
రబీకి నీరు రావడం కష్టమే
వాస్తవంగా నవంబర్ 10 నాటికే రబీ పంట వేయాల్సి ఉంది. గత ఏడాది కృష్ణాడెల్టాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో రబీ పంట వేశారు. ఇందులో 90 వేల ఎకరాలు కృష్ణా జిల్లాలోనే ఉంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతోపాటు కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఇప్పటివరకు జిల్లాలో రబీ పంట వేయలేదు. ఖరీఫ్‌లోనే నీరివ్వలేని ప్రభుత్వం రబీకి ఏ మేరకు ఇస్తుందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రబీలో రైతులకు నీరివ్వడం కష్టమేనని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు బహిరంగంగానే చెబుతున్నారు.
పట్టిసీమ వట్టిసీమే
పట్టిసీమ నుంచి రబీకి నీరు వస్తుందని రైతులు భావిస్తే అత్యాశే అవుతుందని ఇరిగేషన్ పరిశీలకులు చెబుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలకు రబీ పంటకే నీరిచ్చేందుకు సరిపోతుందని, అందులోంచి నీటిని కృష్ణానదికి తరలించడం కష్టమంటున్నారు. ప్రస్తుతం పట్టిసీమ నుంచి రోజుకు 1500 క్యూసెక్కుల కంటే తక్కువ నీరు వస్తుంది. మరోవైపు రబీ సీజన్ ప్రారంభమయింది. రాబోయే నెల రోజుల్లో ప్రభుత్వం ఏదో అద్భుతం చేసి పట్టిసీమ ద్వారా రబీకి కావాల్సిన నీరు తెస్తుందనుకోవడం భ్రమేనని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. దీనికంటే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుందంటున్నారు.
సముద్రం నీరు పైకి వచ్చే అవకాశం.....
రబీ పంట వేసి తడులు పెట్టకపోతే బందరు, కలిదిండి, బంటుమిల్లి, పెడన తదితర ప్రాంతాల్లో భూముల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చి పైకి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదో విధంగా ప్రభుత్వం తమకు రబీకి నీరిచ్చి తమ భూముల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
గత ఏడాది కంటే దారుణం
గత ఏడాది రబీ సీజన్ ప్రారంభం అయ్యేనాటికి పులిచింతల ప్రాజెక్టులో 11 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం పులిచింతల జలాశయంలో అర టీఎంసీ కంటే తక్కువ ఉంది. ఈ నీటిని సాగుకోసం విడుదల చేసేందుకు నీటిపారుదల అధికారులు సిద్ధంగా లేరు. ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కూడా అడుగంటిపోవడంతో అక్కడ నుంచి రబీకి నీరు వదిలే అవకాశాలు కనిపించడం లేదు. ప్రతి ఏడాది వేసవిలో తీవ్ర నీటిఎద్దడి వస్తుంది. గ్రామాల్లో చెరువులు ఎండిపోతే సాగర్, శ్రీశైలం నుంచి అత్యవసరంగా నీటిని వదిలి తాగునీటి కోసం చెరువులను నింపుతారు. ఈ ఏడాది తాగునీటి కోసం చెరువులు నింపడానికి కూడా నీరుండకపోవచ్చని సమాచారం. తాగడానికే నీరు లేనప్పుడు రబీకి ఏ విధంగా సాగునీరిస్తారని నీటిపారుదలశాఖ ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు.