సాక్షి, అమరావతి: నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ పడకేశాయి. కాంట్రాక్టు పొందిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పలుకుబడి ఉండడంతో అధికారులు వారిని ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో ఏళ్ల తరబడి సాగుతున్న ఈ పనుల కారణంగా ప్రజలు నరకం చూస్తున్నారు. మరోవైపు.. పనుల్లో ప్రగతి చూపించేందుకు నిర్మాణ సంస్థలు తేలిక పనులను ముందుగా చేపట్టి షో చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నంలో రక్షిత మంచినీటి పథకాలు, భూగర్భ మురుగునీటి పారుదల, రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం వద్ద పలుకుబడి కలిగిన కొన్ని నిర్మాణ సంస్థలు ఇతరులెవరూ ఆ టెండర్లలో పాల్గొనకుండా చేసుకున్నాయి. తమకు అనుకూలమైన మరో నిర్మాణ సంస్థను టెండరులో పాల్గొనే విధంగా చేసి, దానికంటే తక్కువ రేటుకు టెండర్లు దక్కించుకున్నాయి. స్ధానిక ప్రజాప్రతినిధుల వత్తిడి నుంచి తప్పించుకునేందుకు తేలిక పనులను చేపట్టి వాటిని సాగదీస్తున్నాయి. పెద్ద పనులను కొన్నిచోట్ల అసలు ప్రారంభించనేలేదు. రూ.3,000 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న పెద్ద సంస్థలు వాటిని చేపట్టకపోవడంతో అక్కడి ప్రజలు నిత్యం నరకాన్ని చవిచూస్తున్నారు. ఉదాహరణకు..
► విజయవాడలో ప్రస్తుతం 83 కిలోమీటర్ల నిడివిలో మేజర్ డ్రెయిన్లు, 258 కి.మీ. నిడివిలో మీడియం, 982 కి.మీ. నిడివిలో మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటి వెడల్పు 18 అడుగుల నుంచి 12 అడుగుల వరకు మొదట్లో నిర్మించారు. పెరిగిన జనాభా, పూడిపోయిన డ్రెయిన్లను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లతో స్ట్రామ్‌వాటర్ డ్రైనేజి పనులకు టెండర్లు ఆహ్వానించింది. 440 కి.మీ. నిడివిలో డ్రెయిన్లు నిర్మించేందుకు ఓ పెద్ద సంస్థ టెండర్లు దక్కించుకుంది. రెండేళ్ల కిందట పనులు ప్రారంభమైనా ఇప్పటివరకు ఇంకా 40 కి.మీ. మేరే పనులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు పొందిన సంస్థ సబ్‌కాంట్రాక్టులకు ఇచ్చినా ఉపయోగం లేకపోయింది. వారి వద్ద డ్రెయిన్ల నిర్మాణాలకు అవసరమైన పరికరాలు లేకపోవడంతో పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ఇలా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక.. వర్షాలు పడితే ఆ ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి.
► అలాగే, గుంటూరు నగరంలోని భూగర్భ డ్రైనేజి పనులు కూడా స్థానికులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. రూ.903.82 కోట్ల విలువైన ఈ పనులను మరో బడా సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రెండేళ్ల క్రితం తేలికగా జరిగే పైప్‌లైన్ పనులను ప్రారంభించింది. మొత్తం 1083 కిలోమీటర్ల నిడివిలో పైప్‌లైన్లు వేయాల్సి ఉంటే ఇప్పటివరకు కేవలం 200 కి.మీ.ల మేర మాత్రమే పనులు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. పైపులు వేసేందుకు తవ్విన మట్టిని రోడ్లపైనే వదిలివేయడంతో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ప్రజాప్రతినిధులు, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పనులపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వానికి అందించినా పనుల్లో వేగం పెరగలేదు. ఎస్‌టీపీ, ఆర్‌సీసీ సీవర్‌లైన్లు, మ్యాన్‌హోల్స్ వంటి ఇతర ముఖ్య పనుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. 126 ఎంఎల్‌డి సామర్ధ్యం కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించాల్సి ఉంటే ఇప్పటివరకు 10 శాతంలోపే పనులు జరిగాయి.
► నెల్లూరు నగరంలోనూ రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల పనులకు పిలిచిన టెండర్లలో అక్రమాలు జరిగినట్లు విమర్శలు వచ్చాయి. ప్రజారోగ్యశాఖ ఇంజినీర్లు రక్షిత మంచినీటి సరఫరాకు రూ.495.27 కోట్ల విలువైన పనులకు పిలిచిన టెండర్లలో నిర్మాణ సంస్థలు రింగ్ అయ్యాయని, అంచనా విలువపై 3.95 శాతం అధికంగా రేటుకు ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో ప్రజలపై రూ.19.50 కోట్ల భారం పడింది. అలాగే, రూ.519.15 కోట్ల విలువైన భూగర్భ మురుగునీటి పారుదల పనులకు జనవరిలో ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా ఇంకో ముఖ్యమైన సంస్థ 8.8 శాతం (రూ.564.84 కోట్లు) అధిక రేటుకు టెండరును దక్కించుకుంది. దీంతో ప్రభుత్వంపై రూ.45.68 కోట్ల భారం పడింది.
► ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రక్షిత మంచినీటి సరఫరాకు రూ.39 కోట్లు, మురుగు నీటిపారుదలకు రూ.72 కోట్లతో పిలిచిన పనుల్లోనూ ప్రగతి నామమాత్రంగానే ఉంది.
ఇలా.. ప్రధాన నగరాల్లో జరుగుతున్న పనుల్లో నెలకొంటున్న జాప్యం కారణంగా ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం వద్ద పలుకుబడి కలిగిన ఈ సంస్థలపై చర్యలు తీసుకునేందుకు, కనీసం వాటికి వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి కూడా ఇంజినీర్లు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఒక్కసారి కూడా ఈ పనుల పురోగతిని సమీక్షించిన పాపాన పోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment