హైదరాబాద్: దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ‘డిన్నర్ ఆన్ బోర్డు’ సదుపాయానికి శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరే వెన్నెల,గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణికులకు బస్‌స్టేషన్‌లోనే వారు కోరుకున్న ఆహారపదార్ధాలను ఆర్డర్ పై అందజేస్తారు.ఈ సదుపాయం ఈ నెల 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. మొదట 15 ఏసీ బస్సుల్లో ప్రవేశపెడుతారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు రూట్లో 5 బస్సుల్లో, పూనే రూట్‌లో 2 బస్సుల్లో, షిర్డీ రూట్లో మరో 2 సర్వీసుల్లో,చెన్నై ఒక సర్వీసు, కాకినాడ రూట్లో ఒక సర్వీసులో, విశాఖపట్టణం వెళ్లే 2 బస్సుల్లో, తిరుపతి రూట్లో మరో రెండింటిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరు నెలల పాటు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ప్రయాణికులు కోరుకొనే రోటీ, బిర్యానీ,మీల్స్, సాండ్‌విచ్,కరాచి బేకరీ ఐటమ్స్, పుల్లారెడ్డి స్వీట్లు,తదితర ఆహారపదార్ధాలను ఎంజీబీఎస్‌లో అందజేస్తారు.ఇందుకోసం ప్రయాణికులు తమ ప్రయాణానికి 3 నుంచి 4 గంటలు ముందుగా ఫోన్ : 8688931666 నెంబర్‌కు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. బస్సు బయలుదేరే ముందు ప్రయాణికులు ఆర్డర్ చేసిన పదార్ధాలు వారి చేతికి అందుతాయి. 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్‌ఎం తెలిపారు.