గిట్టుబాటుకలేనా! | Farmers are concerned on turmeric | Sakshi
Sakshi News home page

గిట్టుబాటుకలేనా!

Published Fri, Dec 27 2013 4:37 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers are concerned on turmeric

 ఆర్మూర్, న్యూస్‌లైన్:  పసుపు మద్దతు ధర కోసం రైతులు గతంలోనూ ఆందోళనలు నిర్వహించారు. జాతీయ రహదారులను దిగ్బంధించి ఆటలు ఆడారు. అక్కడే వంటలు చేసుకు ని సహపంక్తి భోజనాలు చేశారు. పాదయాత్రలతో కలెక్టరేట్‌ను ముట్టడించారు. దేశ, రాష్ట్ర రాజధానుల్లో  నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర కో కన్వీనర్ కోటపాటి నర్సింహనాయు డు రాష్ట్ర ముఖ్యమంత్రి, స్పీకర్, కేంద్ర  వ్యవసాయ శాఖ మంత్రిని కలుసుకుని పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు సమర్పించారు.

అయినా స్పందన లేకుండా పోయింది. దీంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సీజన్‌లో పండించిన పసుపును ఉడకబెట్టి, శుద్ధి చేసి మార్కెట్‌కు తరలించడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణమిది. ఆశించిన ధర లభిస్తుందో.. లేదోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. దీర్ఘకాలిక పంట అయిన పసుపును పం డించడానికి ఎకరానికి ఒక లక్ష నుంచి లక్షన్నర రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. సాగు పద్ధతులను అనుసరించి ఎనిమిది నుంచి ఇరవై క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలో నాణ్యమై న పసుపునకు క్వింటాలుకు రూ.4,500 నుంచి రూ. 4,600 వరకు మాత్రమే ధర లభిస్తోంది. దీంతో రైతు లు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది.
 దిగుబడి ఎంత వస్తోంది
 ఈ సీజన్‌లో జిల్లాలో సుమారు 13 వేల హెక్టార్లలో పసుపు పంటను సాగు చేశారు. కొందరు ఆదర్శ రైతులకు ఎకరానికి 20 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి ప్రాంతాల రైతులతోపాటు అధిక మొత్తంలో రైతులకు 8 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. సుమారు 12 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతుకు ప్రస్తుత ధర ప్రకారం లెక్కకడితే సుమారు రూ. 55 వేలకు మించి రాదు. పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ వచ్చి ఆర్థికంగా నష్టపోతున్నారు. నూటికి పదోవంతు ఆదర్శ రైతులకు మాత్రమే దిగుబడి అధికంగా వచ్చి లాభపడుతున్నారు.
 నాటి పసుపు రైతుల ఉద్యమాలు
 మద్ధతు ధర సాధించుకోవడం కోసం స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో పసుపు రైతులు 2008 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఏడు రోజులపాటు ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, బాల్కొండ, భీమ్‌గల్, నందిపేట్ మండలాలలోని గ్రామాల మీదుగా 250 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహిం చారు. ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలకు టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ మద్దతు తెలిపాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, రవీందర్‌రెడ్డి స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 2008 ఫిబ్రవరి 5న కలెక్టరేట్‌ను ముట్టడించారు.
 ప్రధాన రహదారులను దిగ్బంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో, సంబంధిత అధికారులతో చర్చిస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement