బోధన్, న్యూస్‌లైన్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ అధీనంలో ఉండగా చెరుకు పంటకు గిట్టుబాటు ధర లభించేది. రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందేవి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఈ చక్కెర కర్మాగారాన్ని 2002లో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో(జాయింట్ వెంచర్) ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ప్రైవేట్ యాజమాన్యం లాభాపేక్షతో వ్యవహరిస్తూ రైతులను కడగండ్ల పాలు చేస్తోంది. ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.
సమాచారం లేకుండానే..
ఈ సీజన్‌లో క్రషింగ్‌ను 2013 నవంబర్ ఆఖరి వారంలో ప్రారంభిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు రైతులు చెరుకు నరికి ఫ్యాక్టరీకి తరలించారు. అయితే ఫ్యాక్టరీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే క్రషింగ్‌ను నిలిపివేసింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. క్రషింగ్ ప్రారంభించాలంటూ ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో బంద్ కూడా పాటించారు. దిగివచ్చిన యాజమాన్యం డిసెంబర్ ఏడో తేదీనుంచి క్రషింగ్ ప్రారంభించింది. క్రషింగ్ కొనసాగుతోంది.
చెల్లింపుల్లో జాప్యం
ఎన్‌డీఎస్‌ఎల్ పరిధిలో 2013 -14 సీజన్‌కుగాను సుమారు 5 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేశారు. ఇప్పటి వరకు సుమారు లక్షా 60 వేల టన్నుల వరకు చెరుకును ఫ్యాక్టరీకి తరలించారు. ఫ్యాక్టరీ ప్రకటించిన ధర ప్రకారం రైతులకు సుమారు రూ. 42 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. అయితే గడువు దాటినా బిల్లులు చెల్లించకపోవడంతో ఫ్యాక్టరీ యాజమాన్యంపై రైతులు ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో తొలి విడతలో రూ. 7 కోట్లు చెల్లించారు. క్రషింగ్ ప్రారంభానికి 20 రోజుల ముందు హార్వెస్టింగ్ అడ్వాన్స్‌ల కింద ఎకరానికి రూ. 3 వేల చొప్పున ఫ్యాక్టరీ చెల్లించింది. తొలి విడత బిల్లులోనే ఈ అడ్వాన్స్‌తోపాటు ఎరువులకోసం ఇచ్చిన రుణాన్ని మినహాయించుకొంది. మిగిలిన బిల్లులు మాత్రం చెల్లించడం లేదు.
సమస్య సబ్‌కలెక్టర్ దృష్టికి..
బిల్లులు చెల్లించడంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రైతులు గురువారం బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. బిల్లుల చెల్లింపులో ప్రతి ఏటా గడువులు విధిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. స్పందించిన సబ్‌కలెక్టర్.. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ జానకీ మనోహర్‌తో మాట్లాడారు. ఆదివారం బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈ హామీని రైతులు నమ్మడం లేదు. మూడేళ్లుగా ఫ్యాక్టరీ గడువులు విధిస్తూ ఉల్లంఘిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ శ్రమకు ఫలితమేది!
Published Sat, Feb 15 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement
Advertisement