సాక్షి, కరీంనగర్ : రైతులు అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పేలా లేదు. రిజర్వ్‌బ్యాంకు తాజా నిర్ణయంతో వారు చక్రవడ్డీల చక్రవ్యూహంలో చిక్కుకోవడంతోపాటు సహకార వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకమవనుంది.
స్వల్పకాలిక రుణ విధానంపై అధ్యయనం కోసం నాబార్డు చైర్మన్ ప్రకాశ్ బక్షి ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంకు ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ పలు అధ్యయనాలు చేసి సూచనలు చే సింది. రెండంచెల సహకార వ్యవస్థ మాత్రమే ఉండాలని, గ్రామస్థాయిలో ఉన్న ప్రాథమిక వ్య వసాయ పరపతి సంఘాలను(పీఏసీఎస్) రద్దు చేయాలని సూచించింది. జిల్లా సహకార బ్యాం కుల నుంచి రుణాలు ఇప్పించి, వసూలు చేసే క మీషన్ ఏజెంటు స్థాయికి ఈ సంఘాలను పరి మితం చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనల మేరకు సహకార సంఘాల్లో ఉన్న సభ్యులు నేరుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో సభ్యులుగా మారతారు. పీఏసీఎస్‌ల వా టాధనం, డిపాజిట్లు డీసీసీబీ పరమవుతాయి.
ఈ సిఫారసులు అమలులోకి వస్తే సహకార స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని ఈ రంగానికి చెందిన ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు. సహకార వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ఇంతకుముందు వైద్యనాథన్ కమిటీ పలు సిఫారసులు చేసింది. నష్టాల్లో ఉన్న పీఏసీఎస్‌లను బలోపేతం చేసేందుకు, కిందిస్థాయి సహకార సంఘాలను లాభాలబాట పట్టించేందుకు ఆర్థికసాయాన్ని అందించింది. ఈ చర్యలు ఫలితాలు ఇస్తున్న సమయంలో కొత్తగా ఈ ప్రతిపాదనను ముందుకు తేవడం వల్ల పీఏసీఎస్‌ల ఉనికే ప్రశ్నార్థకం కానుంది.
దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సహకార వ్యవస్థ పటిష్టంగా ఉండగా... కరీంనగర్ జిల్లా జాతీయస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామీణ ప్రాంతాల రైతులు ఎక్కువ మంది వాణిజ్య బ్యాంకుల వద్దకు వెళ్లాలంటే తటపటాయిస్తుంటారు. వాణిజ్య బ్యాంకులు ఇస్తున్న వ్యవసాయ రుణాలు కూడా తక్కువే. వ్యవసాయానికి ఇచ్చే స్వల్పకాలిక రుణాల్లో పీఏసీఎస్‌లదే అగ్రస్థానం. జిల్లాలో 134 పీఏసీఎస్‌లు ఉండగా ఐదు లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరిలో నాలుగు లక్షల మందికి పీఏసీఎస్‌ల నుంచి రుణాలు అందుతున్నాయి. ఖరీఫ్‌లో పీఏసీఎస్‌ల నుంచి రూ.170 కోట్ల మేర రుణాలు అందాయి. సహకార సంఘాలు రద్దయితే రైతులు ఈ రుణాల కోసం ముప్పుతిప్పలు పడాల్సి వస్తుంది, సహకార సంఘాల మీద ఆధారపడిన వేలాది మంది బజారున పడతారు. పునాదులను దెబ్బతీస్తే భవిష్యత్తులో మొత్తం వ్యవస్థే కుదేలయ్యే ప్రమాదం ఉందని సహకార రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రకాశ్ బక్షి సిఫారసుల మీద రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. రిజర్వ్ బ్యాంకు ఈ సిఫారసులను ఆమోదించినా... వాటిని ఆమోదించాలా? లేదా? అనే అంశం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. సహకార వ్యవస్థ రాష్ట్ర పరిధిలో ఉండడంతో బక్షి సిఫారసుల మీద వస్తున్న అభ్యంతరాలపై క్షేత్రస్థాయి నుంచి పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే సహకారశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా జిల్లాలో పర్యటించారు. సమగ్ర పరిశీలన తర్వాతే ఈ సిఫారసుల మీద నిర్ణయం ఉంటుందని చెప్పారు.
సహకారానికి మంగళం!
Published Fri, Aug 23 2013 3:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement