వారంతా రెక్కాడితేగానీ... డొక్కాడని ఉపాధి కూలీలు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. పొట్ట పోషణకోసం వివిధ ప్రాంతాల్లో ఉపాధిపనుల నిమిత్తం వెళ్లారు. మంగళవారం ఉదయం హఠాత్తుగా ఒక ఇంట్లో అగ్గి పుట్టింది. వేడి గాలులు దానికి తోడయ్యాయి. అంతే క్షణాల్లో మంటలు వీధి మొత్తం వ్యాపించాయి. పూరిళ్లు... పెంకుటిళ్లు... చివరకు డాబాలను కూడా అంటుకున్నాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలంతా వారంతా మిగిలారు. ఆ ప్రాంతమంతా బాధితుల ఆర్తనాదాలతో హోరెత్తింది.
లావేరు: మురపాకలోని యాదవ వీధిలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 11 గంటలు సమయంలో తొలుత వడ్డి సూర్యనారాయణ ఇంటి నుంచి మంటలు రావడం... కేవలం పదే నిమిషాల్లో 42 పూరిళ్లు, 8 డాబా ఇళ్లు, 4 పెంకుటిళ్లు, 3 పశువుల శాలలు దగ్దమయ్యాయి. మొత్తం రూ. మూడుకోట్ల ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా. సామాన్లు రక్షించుకునేందుకు యత్నించిన ఒకరికి గాయాలయ్యాయి. వీధిలోని వారంతా మంగళవారం ఉదయం శ్రీకాకుళం పట్టణం, మురపాక గ్రామంలోని ఉపాధి పనులకు వెళ్లిపోయిన తరువాత సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది.
అదే సమయంలో వేడిగాలులు వీయడంతో సర్వం కాలి బూడిదయ్యింది. ప్రమాదంలో వడ్డి సూర్యనారాయణ, బొట్ట రాములు, వడ్డి అశిరప్పడు, వడ్డి రాములు, వడ్డి శిమ్మయ్య, కోన రామప్పడుతో పాటు మరో 48 మందికి చెందిన ఇళ్లు ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో ఇళ్లతోపాటు నగదు, బంగారం, వెండి వస్తువులు, విద్యుత్ మీటర్లు, తిండిగింజలు, బట్టలు, వంటపాత్రలు, ఎల్‌ఐసీ బాండ్లు, రేషన్‌కార్డులు, విద్యార్థుల పుస్తకాలు, కోళ్లు వంటివికూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇంటిలో ఉన్న వస్తువులు వేటిని రక్షించుకోలేక బాధితులంతా కట్టుబట్టులుతో నిరాశ్రయులుగా మిగిలారు.
ఇళ్లల్లో ఉన్న సామాన్లను బయటకు తేవడానికి బాదిత కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వడ్డి కృష్ణ అనే వ్యక్తి తెగించి వెళ్లగా ముఖం, చేతులు బాగా కాలిపోయాయి. అతనిని తొలుత మురపాక పీహెచ్‌సీకి తీసుకెళ్లగా వైద్యాధికారిణి మంజీర వైద్యసేవలు అందించి మెరుగైన చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం సంభవించిన వెంటనే గ్రామస్తులు స్పందించి మంటలను అదుపుచేశారు. ప్రమాద విషయాన్ని మురపాక సర్పంచ్ అల్లంశెట్టి రాధ, ఎంపీటీసీగోపి, టీడీపీ నాయకులు జనార్దనరావు, మంగయ్య, బాస్కరరావు, గ్రామస్తులు రణస్దలం,పొందూరు, శ్రీకాకుళం అగ్ని మాపక కేంద్రాలకు తెలియజేయడంతో వారు వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేశారు.
అధికారుల సందర్శన
ప్రమాద విషయం తెలుసుకున్న లావేరు తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, ఎంపీడీఓ ఎం.కిరణ్‌కుమార్, జేఆర్‌పురం సీఐ విజయకుమార్, ఆర్‌ఐ సన్యాసిరావు, మండల సర్వేయర్ వెంకటేశ్వరరావు, వీఆర్‌ఓ శ్రీనివాసరావు, లావేరు ఏఎస్‌ఐ మోహనరావు, రణస్థలం ఎస్‌ఐ వినోద్‌బాబు గ్రామానికి చేరుకున్నారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎస్పీలకు ప్రమాద సమాచారాన్ని తెలియజేయడంతో జిల్లా ఎస్పీ ఖాన్, ఆర్డీఓ దయానిధి, డీఎస్పీ కె.భార్గవనాయుడు గ్రామానికి వచ్చి ప్రమాదం ఏవిధంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కాలిన ఇళ్లను పరిశీలించారు.
ముమ్మర సహాయక చర్యలు.
ప్రమాదం సంభవించిన వెంటనే మురపాక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు, గ్రామస్తులు, యువత సహాయక చర్యలు చేపట్టారు. మురపాక వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అల్లంశెట్టి రాధ, మాజీ సర్పంచ్ అల్లంశెట్టి అప్పలరాజు, ఎంపీటీసీ కొన్ని గోపీ, వైసీపీ నాయకులు కొన్ని ధనుంజయరావు, టీడీపీ నాయకులు జల్లేపల్లి జనార్దనరావు. తేనేల మంగయ్య, కలిశెట్టి బాస్కరరావు, గ్రామస్తులు, యువత వెంటనే స్పందించి ప్రమాద బాధితులకు సహాయకచర్యలు చేపట్టారు.
బడుగుల బతుకులు బుగ్గిపాలు
Published Wed, May 13 2015 12:58 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement