- ‘తెలంగాణ’ను అడ్డకోవడంపై కన్నెర్ర
- ఢిల్లీలో జిల్లా నేతల నిరసనలు
- గొంతెత్తిన సొంత పార్టీ శ్రేణులు
వరంగల్, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై జిల్లా కాంగ్రెస్ నేతలు విమర్శలవాడిని పెంచారు. ఢిల్లీ పరిణామాలతో కన్నెర్ర చేస్తున్నారు. బహిరంగ నిరసనలు చేపట్టారు. ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులు కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సీఎం బహిరంగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సిద్ధం కావడంతో ఈ ప్రాంత నేతలు తేల్చుకోవాల్సిన తప్పనిస్థితి నెలకొంది. ప్రధానంగా అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పటి నుంచి సీఎంకు జిల్లా నేతలకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పెరిగాయి.
సీఎంతో ఇంతకాలం అంటకాగుతూ వచ్చిన నేతల్లో మంత్రులు బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డిలు క్రమంగా ఆయన తీరుపై మండిపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో దీక్షకు దిగడంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ అంకం చివరి దశకు చేరుకోవడంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు ధైర్యం పెరుగుతోంది. తమ రాజకీయ ఉనికిని రక్షించుకోవడంతోపాటు ఇం తకాలం తమలో ఉన్న తెలంగాణ ఆకాం క్షను బహిరంగంగా వ్యక్తీకరించాల్సిన పరిస్థితి నెలకొం ది.
ప్రజలవద్దకు...
తెలంగాణపై కాంగ్రెస్ సానుకూల నిర్ణయం తీసుకోగానే కృతజ్ఞతల సభలు నిర్వహించారు. తదుపరి పార్టీ నాయకులు వెనుకంజ వేశారు. ఈ క్రమంలో మళ్ళీ పూర్తి నమ్మకం నెలకొనడంతో నియోజకవర్గాలో తమదైన పద్ధతుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనగాం నియోజకవర్గంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి ఆధ్వర్యంలో పాదయాత్రకు సిద్ధమయ్యారు. చేర్యాల మండల కేంద్రంలో గురువారం నుంచి యాత్రను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కాగా, తెలంగాణ బిల్లు ఢిల్లీకి చేరుకున్నందున అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అక్కడే మకాం వేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బలరామ్‌నాయక్, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, రాపోలు ఆనందభాస్కర్ ముందుగానే చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి బిల్లుతో పాటే ఢిల్లీలో వాలిపోయారు. ఢిల్లీలో బుధవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీక్షలు చేపట్టేందుకు బయలుదేరిన సమయంలో తెలంగాణ ప్రాంత మంత్రులతో సహా గండ్ర తదితరులు బస్సును అడ్డుకున్నారు.
జిల్లాలో నిరసనలు
సీఎం తీరును వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. సీమాంధ్ర సీఎం దీక్షకు నిరసనగా మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే మాలోతు కవిత తెలంగాణ సాధనదీక్ష చేపట్టారు. సోనియూ దయతోనే కిరణ్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.కేయూ రెండో గేట్ వద్ద సీఎం దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు.