హైవే ఫోన్ ఇదే
యడ్లపాడు: ఇకపై జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం జరిగినా.. ఆ ప్రమాదంలో బాధితుల ఫోన్లు ధ్వంసమైనా వెంటనే హైవే నిఘా విభాగానికి సులువుగా సమాచారం అందించవచ్చు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని హైవే మార్గంలో ప్రతి కిలోమీటరుకు ఒక టెలిఫోన్‌తోపాటు వీడియో కెమెరాలను ఏర్పాటు చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే టెలిఫోన్ వద్దకు వెళ్లి రెడ్ బటన్ నొక్కితే వెంటనే మంగళగిరిలోని టోల్‌ప్లాజాలో నిఘా విభాగానికి సమాచారం అందుతుంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కోడ్ ద్వారా తెలుసుకుని అక్కడికి సమీపంలోని పెట్రోలింగ్ వాహనాన్ని లేదా క్రేన్‌లను పంపిస్తారు. రోడ్డు ప్రమాదాలను తెలుసుకుని సత్వరమే బాధితులకు వైద్య సహాయం అందించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు హైవే అధికారులు చెప్పారు.
24 గంటలు అందుబాటులో ఉండే ఈ ఫోన్, వీడియోల పనితీరును టోల్‌ప్లాజా కంట్రోల్ రూం సిబ్బంది పరిశీలిస్తున్నారు. కాజ టోల్ ప్లాజా పరిధిలో జాతీయ రహదారి పక్కన కిలోమీటరుకు ఒకటి చొప్పున యడ్లపాడు వరకు 60 ఫోన్లు, వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి రెండురోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.