సాక్షి, హైదరాబాద్ : తన పాలనపై నిజాయితీగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం సీఎం చంద్రబాబు నాయుడుకు ఉందా అని రాయచోటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ధైర్యం రాలేదంటే ప్రజలను వంచించాలని చూస్తున్నారని అర్థమన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'ఎన్నికలు వస్తున్నాయనే ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. విభజన సమస్యలు కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబుకు గుర్తు రాలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం చంద్రబాబు ఏం చేశారు? ప్రజల సమస్యలపై 9ఏళ్లుగా పోరాడుతోంది ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. చంద్రబాబు పాలనంతా మోసపూరితం. ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులే బయటకు వచ్చి చంద్రబాబు దోపిడీ గురించి మాట్లాడుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిలా ఫలానా సంక్షేమ కార్యక్రమాన్ని చేశానని ధైర్యంగా చంద్రబాబు చెప్పగలరా? వైఎస్ జగన్‌కు భయపడే చంద్రాబు రూ.2 వేలకు పింఛన్ పెంచారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీకి వస్తామన్నాం. అసెంబ్లీపై మాకు చాలా గౌరవం ఉంది.
ప్రజలకు ఏదో చేస్తున్నట్లు క్యాబినెట్ మీటింగ్‌పై బిల్డప్ ఇస్తున్నారు. నాలుగున్నర ఏళ్ల నుంచి ప్రజల కష్టాలు పట్టించుకోకుండా.. ఇప్పుడు ఏదో చేస్తున్నట్లు చెప్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో ప్రకటించే ప్రయత్నం చేశారు. 2009లో అన్ని పార్టీలు ఏకం అయినా వైఎస్సార్ కొత్త పథకాలు ప్రకటించకుండానే అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రులు లేఖలు రాస్తున్నారు. వాళ్లు అధికారంలో ఉండి లేఖలు రాయడం నవ్వు తెప్పిస్తుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు టీఆర్‌ఎస్‌కి భయపడుతున్నారు. హైదరాబాద్‌లో మనకు రావాల్సిన హక్కుల కోసం ఎందుకు పోరాడటం లేదు.
ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబర్స్ మెంట్ పై పోరాటాలు చేసింది వైఎస్ జగన్ అయితే, ధర్మపోరాట దీక్ష పేరుతో కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేసింది చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాల అమలులో విఫలం అయ్యామని క్యాబినెట్ మీటింగ్‌లో తీర్మానం చేయండి. వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రైతులకు ఏదో చేస్తారట. రైతులపై ప్రేమ ఉన్నట్లు డ్రామా చేస్తున్నారు. దళారులే మద్దతు ధర పెంచుకొని రైతులకు అన్యాయం చేశారు. రైతులు సంతోషంగా ఎక్కడ ఉన్నారో చూపించండి. రుణమాఫీ ఎక్కడ చేశారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? చిత్తశుద్ధితో ప్రజలకు న్యాయం చేయండి. అధికారంలోకి బీజేపీ వస్తే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ద్వారా మళ్లీ బీజేపీలో చేరేలా చూస్తున్నారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ ఏం చెప్పారో వినండి. సిద్ధాంతాలు లేని పార్టీ టీడీపీ. ఆఖరి సమయంలో క్యాబినెట్ భేటీలో ప్రజలు గుర్తుకువచ్చారా ? కొత్తగా చంద్రబాబు చేసింది ఏమి లేదు. స్వార్ధ ప్రయోజనాలు, ఎన్నికల్లో లబ్ది కోసం కాకుండా.. చిత్తశుద్ధితో పనులు చేయాలి. వంగవీటి రాధకి భరోసా ఇచ్చినా పార్టీ వీడటం దురదృష్టకరం' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment