గజరాజులతో రైతుల గజగజ !
చంద్రగిరి, న్యూస్‌లైన్ : శేషాచల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు గజరాజుల దాడులతో గజగజలాడుతున్నారు. ప్రతి ఏటా వేసవిలో ఇవి మామిడి తోటలపై దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శనివారం, ఆదివారం వరుసగా రాత్రి వేళ చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలోని ఓ రైతు మామిడి తోటపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
చాలా ఏళ్లుగా..
శేషాచల అటవీ ప్రాంతానికి అనుకుని వేలాది ఎకరాల పంటపొలాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల రైతులు అటవీ సరిహద్దు గ్రామాల్లో మామిడి తోటలు సాగు చేశారు. బాగా నీటివసతి ఉన్న వారు చెరకు, వరి సైతం సాగుచేస్తున్నారు. ఈ పచ్చదనమే రైతుల పాలిట శాపంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా వేసవిలో ఈ ప్రాంతాల్లోని పంటపొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి.
ఇవి గుంపులు గుంపులుగా వస్తుండడంతో రైతులు సైతం వాటిని చూసి పారిపోవాల్సి వస్తోంది. ఇవి చెరకు తోటలను, మామిడి తోటలను ధ్వంసం చేస్తున్నాయి. వరి పంటను తొక్కేస్తున్నాయి. ఏడాదిపాటు కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగుల దాడిలో ధ్వంసమవుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు అప్పటి స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ సరైన చర్యలు తీసుకోలేదు. గతంలో ఏనుగులు దాడి చేసి మనుషుల ప్రాణాలను సైతం హరించాయి. అయినా అధికారుల్లో స్పందన లేదు.
ఒక్కసారి వచ్చాయంటే..
ఏనుగులు తరచూ వేసవిలో రావడానికి కారణం వాటికి అడవిలో నీరు, ఆహారం దొరక్కపోవడమే. ఇవి ఒక్కసారి అడవిని వదిలి సమీపంలోని పంటపొలాల్లోకి వచ్చాయంటే చాలు.. తర్వాత రోజూ వస్తూనే ఉంటాయి. రాత్రి వేళ తోటలపై పడి చెట్లను విరిచి తిని తిరిగి అడవిలోకి వెళ్లిపోతాయి. పగలు విశ్రాంతి తీసుకుని రాత్రికాగానే మళ్లీ వస్తాయి. దీంతో ఆ ప్రాంత రైతులు, గ్రామస్తులు హడలిపోతుంటారు.
అధికారులు జాగ్రత్తలకే సరి..
రోజూ ఏనుగులు వచ్చి పొలాలపై దాడులు చేస్తున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు తోటలపై దాడి చేసి వెళ్లాక అధికారులు వచ్చి పరిశీలించి, ఇళ్ల నుంచి బయటకు రావద్దండి, కాపలా కోసం పొలాల్లో ఉండద్దండి అని సలహా ఇస్తున్నారే కానీ పటిష్టమైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదంటున్నారు. ప్రతి సంవత్సరం ఏనుగుల దాడులతో లక్షలాది రూపాయల పంటలు నష్టపోతున్నామంటున్నారు. ఇకనైనా ఏనుగులు రాకుండా ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
దాడులు మొదలయ్యాయి..
ఎండలు తీవ్రం కావడం, అడవిలోని చెట్లు, నీటి కుంటలు ఎండిపోవడం, శేషాచలంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఏనుగులకు తిండి, నీరు లేకుండా పోయాయి. దీంతో పంట పొలాలపై ఏనుగుల దాడులు మొదలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట, చిట్టేచర్ల గ్రావూలకు చెందిన రైతులు రవుణ, సుబ్రవుణ్యం మామిడితోటలపై ఏనుగులు దాడి చేశాయి. సుమారు 50 మామిడి చెట్ల కొమ్మలు విరిచేశాయి. అలాగే శనివారం రాత్రి చంద్రగిరి మండలం ఏ.రంగంపేట అటవీ చెక్‌పోస్టుకు సమీపాన రైతు కాయం భాస్కర్‌రెడ్డికి చెందిన మామడితోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సుమారు 100 మామిడి చె ట్ల కొమ్మలు విరిచేశాయి.
ఈ ఘటనలో సుమారు 5 టన్నుల మామిడిపంట నష్టం వాటిల్లింది. విషయం తెలియగానే చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదివారం ద్విచక్రవాహనంలో వెళ్లి తోటను పరిశీలించారు. బాధితులకు న్యాయం చేయాలని అటవీ అధికారులను కోరారు. కాగా ఆదివారం రాత్రి ఏనుగులు తిరిగి ఇదే తోటపై దాడి చేసి మరిన్ని చెట్లను విరిచేశాయి.