హామీల బాబు
సాక్షి, గుంటూరు
రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట మార్చడంపై జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా వారి పక్షాన నిలిచి పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.
ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలువు మేరకు అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట బుధవారం ధర్నాలు చేపడుతున్నారు. జిల్లాలోని ముఖ్యనేతలతో మంగళవారం సమావేశమైన పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ బుధవార ం చేపట్టనున్న ధర్నా కార్యక్రమంపై చర్చించారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలతో పాటు రైతులు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.
ఒక్క హామీ నెరవేర్చలేదు
చిలకలూరిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు చేప్పేవన్నీ అబద్ధాలేనని, ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు మాఫీ చేస్తామని, తొలి సంతకం వాటిపైనే ఉంటుందని చెప్పి కమిటీల పేరుతో కాలయాపన చేశారని విమర్శించారు. అధికారం చేపట్టి ఐదు నెలలైనా ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఆరోపించారు.
నిరుద్యోగభృతి, ఇంటికొక ఉద్యోగం అంటూ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఫించన్లు ఐదు రెట్లు పెంచుతామని చెప్పి టీడీపీ కార్యకర్తలను సామాజికి కార్యకర్తలుగా నియమించి వైఎస్సార్ అభిమానుల ఫించన్లు తొలగించారన్నారు.
మాటల ద్వారా ప్రజలను మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి పార్టీ సంసిద్ధమై ఉందన్నారు.
నియోజవర్గంలోని నాదెండ్ల, యడ్లపాడు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట, చిలకలూరిపేట మండల, పట్టణ ప్రాంతాలకు సంబంధించి చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశంలో పార్టీ పట్టణ, నాదెండ్ల, చిలకలూరిపేట మండల కన్వీనర్లు ఏవీఎం సుభానీ, కాట్రగడ్డ మస్తాన్‌రావు, చాపమడుగు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.