ఉరిమిన ఉద్యమ గోదారి
Published Thu, Sep 12 2013 4:39 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, ఏలూరు : ఒక్కొక్కరూ ఒక్కో నిప్పుకణిక అవుతున్నారు.. పిడికిళ్లు బిగించి ఉద్యమంలో ముందుకు సాగుతున్నారు. ఊపిరి ఆగిపోయినా తెలుగు నేలను ముక్కలు కానివ్వబోమంటూ గర్జిస్తున్నారు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పట్టణాలను దాటి పల్లెల్లో అడుగుపెడుతున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి ఉద్యమ ఆవశ్యకతను గ్రామాల్లో చాటిచెబుతున్నారు. ఎన్జీవోలు, జేఏసీల ఆధ్వర్యంలో ఉద్యోగులు బుధవారం నుంచి పల్లెబాట పట్టారు. పోలవరం, పోడూరు, చింతలపూడి మండలాలతోపాటు జిల్లాలోని పలు గ్రామాల్లో సమైక్యాంధ్ర అవగాహన సదస్సులు నిర్వహించారు. బుధవారానికి 43వ రోజుకు చేరుకున్న ఉద్య మం ప్రజ్వరిల్లుతోంది. ఉద్యమంలో భాగంగా 48 గంటలపాటు భీమవరం పట్టణం లో పూర్తిబంద్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అన్ని జేఏసీల నాయకులు చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. 24 గంటలు అత్తిలి బంద్‌కు సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది.
పెరవలి మండలం పిట్టల వేమవరం నుంచి ఉండ్రాజవరం మండలం తాటిపర్రు వరకూ నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాదయాత్ర చేశారు. ఏలూరులో బుధవారం సాయంత్రం జిల్లా విద్యార్థి జేఏసీ ఆధ్యర్యంలో విద్యార్థి గర్జన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. తణుకులో జిల్లా కేబుల్ ఎంఎస్‌వోలు, ఆపరేటర్ల ఆధ్వర్యంలో లక్షగళార్చన చేశారు. దీనికి మద్దతుగా జిల్లాలో మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4 వరకు నాలుగు గంటలపాటు వినోద చానల్స్ ప్రసారాలను నిలిపివేశారు. తాడేపల్లిగూడెంలో విద్యార్థులు గర్జించారు. రాష్ట్ర విభజన జరిగితే భవిష్యత్ ముఖ చిత్రం ఎలా ఉంటుందో లఘు నాటికల ద్వారా వైఎస్‌ఆర్ బీఎస్ కళాశాల విద్యార్థులు కళ్లకు కట్టినట్టు చూపించారు. కొవ్వూరులో నిర్వహించిన ఉగ్ర గోదావరి లక్షజన గర్జన ఉప్పొంగింది.
ఈ కార్యక్రమాలకు విశేష సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో ఎంఎస్‌వోలు మోటారు సైకిళ్లర్యాలీ నిర్వహించారు. ఆరుగొలను, కొత్తూరు గ్రామాలకు చెందిన పొక్లెయిన్, క్వారీ లారీలతో పోలీసు ఐలండ్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసనను తెలిపారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకునేంతవరకూ ఉద్యమం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. బుట్టాయగూడెంలో రెండవ రోజు బంద్ విజయవంతమయ్యింది. గురువారం నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాం జనేయులును విద్యార్థి జేఏసీ నాయకులు కోరా రు. ఉండిలో కళింగసంఘం ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో చేశారు. బంద్ పాటించారు.
టి.నరసాపురంలో వందకు పైగా ఆటోలతో ఆటోవాలాలు ర్యాలీ చేశారు. ఎన్జీవోలు పల్లెయాత్ర చేపట్టారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఉద్యోగ జేఏసీ చింతలపూడిలో ప్రకటించింది. మండలంలో పలు గ్రామాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. చాగల్లులో దీక్షలకు పింఛన్‌దారులు సంఘీభావం తెలిపారు. పాలకొల్లు, పోడూరు మండలంలోని అప్పనచెరువు గ్రామంలో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో పల్లెబాటలో భాగంగా ర్యాలీ చేశారు. పోడూరు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ చేశారు.
ఉంగుటూరులో ఏలూరు ప్రధాన కాలువలో ఉపాధ్యాయులు జలదీక్ష చేసి నిరసన తెలిపారు. ఏలూరులో కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు ఫైర్‌స్టేషన్ సెంట ర్‌లో మానవహారం నిర్వహించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డివైడర్‌లపై ఉన్న మొక్కలకు నీరు పోసి న్యాయవాదులు సమైక్య నినాదాలు చేశారు. తాళ్లపూడిలో పాఠశాలలు మూత పడ్డాయి. పోడూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ చేశారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అండగా వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పెంటపాడు మండలానికి చెందిన పలువురు దీక్షల్లో పాల్గొన్నారు.
Advertisement
Advertisement