పనుల్లేవ్.. పాఠాల్లేవ్
Published Tue, Sep 3 2013 5:39 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, ఏలూరు: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీలు.. చిన్న దుకాణం తెరవకపోతే తీసుకున్న లోన్లు కట్టలేని వ్యాపారులు.. పనిచేయకపోతే ఇల్లు గడవని మధ్య తరగతి ప్రజలు.. వారే సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమ సారథులు.. రాష్ట్రాన్ని ముక్కలుకాకుండా కాపాడుకోవడం కంటే పెద్దపని మరొకటి లేదంటూ ఉద్యమం సాగిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు అదే స్ఫూర్తితో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. కార్పొరేట్ చదువుల్లో ర్యాంకుల కోసం బండెడు పుస్తకాలను రాత్రీ, పగలూ బట్టీ పడుతూ, సెలవు రోజుల్లోనూ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇప్పుడు తరగతి గదులు వదిలి రోడ్డెక్కారు.
ఐదు లక్షల మంది ఉద్యమ బాట పట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు కీలక భూమిక పోషిస్తున్నారు. ఉద్యమానికి వెన్నెముకగా నిలుస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం సీడబ్ల్యూసీ జూలై 31న ప్రకటించిన వెంటనే జిల్లాలో తొలిసారిగా దీన్ని వ్యతిరేకించింది విద్యార్థులు, సామాన్య ప్రజలే. స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి నిరసనను తెలిపారు. నాటినుంచి నిత్యం వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో క్షణం తీరిక లేకుండా చదువే ప్రధానంగా కొనసాగుతుంది. ఈనేపథ్యంలో వారానికో పరీక్ష, నిత్యం హోంవర్క్, స్టడీ అవర్లు, ర్యాంకుల కోసం కుస్తీ పడుతూ, ఐఐటీ, ఎంసెట్, మెడిసిన్ కోసం ఫౌండేషన్ కోచింగ్స్ వైపు పరుగులు తీసే విద్యార్థులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమించడమే కర్తవ్యంగా భావిస్తున్నారు.
ఎందెందు చూసినా
ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షల్లోనూ విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. ఏలూరులో జూనియర్ కళాశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని 5లక్షల సార్లు కాగి తాలపై రాసి నిరసన తెలిపారు. మరో 50 వేల మంది విద్యార్థులు ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ ‘శత సహస్ర స్వర సమైక్య రాగం’ ఆలపిం చారు. పాలకొల్లులో అన్నిపాఠశాలలు, కళాశాల విద్యార్థులు ‘విద్యార్థి గర్జన’ చేశారు. తాడేపల్లిగూడెంలో పిరమిడ్ ప్రదర్శనలు, నృత్యాలతో ర్యాలీ నిర్వహిం చారు. ఇలాంటి ఎన్నో..ఎన్నెన్నో కార్యక్రమాలతో విద్యార్థి లోకం పోరాడుతోంది. సామాన్యులు కూడా ఇదే రీతిలో ఉద్యమంలో పాల్గొంటున్నారు. రోడ్లపై క్షవరం చేస్తూ, దుస్తులు ఉతుకుతూ, వంటలు చేస్తూ, తోపుడు బళ్లు నడుపుతూ, ఆటోలు, రిక్షాలు, కార్లు, లారీలు, ట్రాక్టర్లతో, భారీ ఫ్లెక్సీలతో నిరసనలు తెలియజేస్తున్నారు.
Advertisement
Advertisement