లక్షలాది గొంతులు ఒక్కటై..!
Published Wed, Sep 4 2013 4:47 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా ‘పశ్చిమ’ మరోసారి సమైక్య సింహగర్జన చేసింది. అష్టదిక్కులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదంతో ప్రతిధ్వనించాయి. లక్షలాదిగా తరలివచ్చిన జనంతో రహదారులు మూసుకుపోయాయి. ఇసుక వేస్తే రాలనంత జనవాహినితో భీమవరం పట్టణం కిక్కిరిసిపోయింది. వారంతా సామూహికంగా చేసిన కోటి గర్జన ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా చేసింది. పాలకొల్లులోనూ అశేషంగా తరలివచ్చిన జనం లక్షసార్లు ‘క్షీరపురి సమైక్య గళం’ వినిపించారు. భీమడోలులో 50 వేలమంది ‘పల్లె గర్జన’ పేరిట సమైక్యనాదం చేశారు. తాళ్లపూడిలో 10వేల మంది ‘జై సమైక్యాంధ్ర’ అంటూ లక్షసార్లు నినదించారు.
ఏలూరు, న్యూస్‌లైన్: లక్షలాది గళాలు ఒక్కటయ్యాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం గర్జించాయి. మంగళవారం భీమవరంలో లక్షమంది కోటి గర్జన పేరిట గళమెత్తారు. పాలకొల్లులో క్షీరపురి సమైక్య గర్జన పేరిట వేలాదిమంది కదం తొక్కారు. భీమడోలులో 50 వేల మంది లక్ష గళార్చన చేశారు. తాళ్లపూడిలో 10 వేల మంది లక్ష గర్జన చేశారు. పెనుగొండ మండలం చినమల్లం గ్రామానికి చెందిన వెయ్యిమంది రైతులు సిద్ధాంతం చేరుకుని జాతీయ రహదారిని దిగ్బంధించారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని, ఎంపీలు, కేంద్ర మం త్రులు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమ స్రవంతిలోకి రావాలని జిల్లావ్యాప్తంగా ఎన్జీవోలు ముక్తకంఠతో డిమాండ్ చేశారు. ఏలూరులో మంగళవారం ఉదయం నుంచి 72 గంటల బంద్ మంగళవారం మొదలైంది.
వ్యాపారసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, విద్యాలయాలు బంద్ అయ్యాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య కళాశాలను మూసివేసి సుమారు వెరుు్యమంది వైద్యులు, సిబ్బంది మానవహారం నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు దీక్షలు ప్రారంభించారు. నరసాపురంలో జేఏసీ పిలుపుమేరకు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. అంబేద్కర్ సెంటర్‌లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో బంద్ విజయవంతమైంది. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ, బోసుబొమ్మ సెంటర్‌లో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రక్త పరీక్షా కేంద్రాల అసోసియేషన్, మందుల షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు.
దంత వైద్యులు రోడ్డుపైనే వైద్యం చేసి కేంద్రానికి నిరసన తెలి పారు. ఆచంటలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 48 గం టల బంద్ విజయవంతమైంది. తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం గోదావరి గట్టు, ప్రధాన రహదారి మీదుగా 8 కిలోమీటర్ల మేర గోదావరి మహా మానవహారం నిర్వహించారు. పెనుగొండలో దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్‌ను విద్యార్థి జెఏసీ నాయకులు ఘెరావ్ చేశారు. తండ్రిచే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. పెనుమంట్ర మండలం పొలమూరులో వంటావార్పు చేశారు. చింతలపూడిలో నాయూబ్రాహ్మణుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ కె.జయరాజు సంఘీభావం తెలిపారు. రాజేష్ వారితో కలిసి రోడ్డుపై గడ్డం గీసి విభజన ప్రకటనపై నిరసన తెలిపారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు.
లింగపాలెంలో జేఏసీ సభ్యులు, విద్యార్థులు ర్యాలీ, మానవహారం చేశారు. బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో జేఏసీ, ఉపాధ్యాయులు, ఎన్జీవోల దీక్షలు కొనసాగారుు. చాగల్లులో జేఏసీ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్య మం నిర్వహించారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పశివేదలలో పాఠశాల విద్యార్థులు, వేములూరులో అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు ర్యాలీలు చేశారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో కొవ్వూరు పట్టణంలో ఎండ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. నీలాద్రిపురం, పెదతాడేపల్లిలోని విద్యాసంస్థల విద్యార్థులు తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. పాత గోనె సంచుల వ్యాపారులు గోనెలపై సోనియా, కేసీఆర్ బొమ్మలను ఉంచి దబ్బలంతో కుట్టారు.
ట్యాక్సీ వర్కర్సు యూనియన్ ఆధ్వర్యంలో టెలిఫోన్ ఎక్స్ఛేంజి వద్ద వంటావార్పు చేశారు. పెంటపాడులో ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన వర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో మూడు రోజుల బంద్ మొదలైంది. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన ఎన్టీఆర్ ఫాన్స్ దీక్షల్లో పాల్గొన్నారు. గణపతి సెంటర్‌లో నిడదవోలు, చాగల్లు మండలాల ప్రధానోపాధ్యాయులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. నిడదవోలు మండలం కోరుమామిడిలో ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాదయాత్ర చేపట్టారు. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రులో పవన్ యూత్ ఆధ్వర్యంలో 48 గంటల నిరవధిక దీక్ష ప్రారంభించారు.
Advertisement
Advertisement